ధోనీ కంటే ముందు నేను టీమిండియాలోకి వచ్చా! కానీ ఆ ఒక్క ఇన్నింగ్స్ వల్ల... దినేశ్ కార్తీక్ కామెంట్..

First Published | Feb 26, 2023, 11:14 AM IST

రాహుల్ ద్రావిడ్ తర్వాత సరైన వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం చాలా మందిని ప్రయత్నించింది టీమిండియా. పార్థివ్ పటేల్‌తో పాటు దినేశ్ కార్తీక్ అలా టీమ్‌లోకి వచ్చి వెళ్లినవారే. ధోనీ కంటే ముందు టీమిండియాలోకి వచ్చిన దినేశ్ కార్తీక్, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు...

Image credit: Getty

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అదరగొట్టిన దినేశ్ కార్తీక్, 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి... ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ ఆడాడు. టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో రిషబ్ పంత్ కంటే ఎక్కువ మ్యాచులు ఆడాడు దినేశ్ కార్తీక్..

మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌లో వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా సెటిల్ కావడంతో మిగిలిన వికెట్ కీపింగ్ బ్యాటర్లు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయారు. పార్థివ్ పటేల్ కెరీర్ పూర్తిగా దేశవాళీలకే అంకితం కాగా, దినేశ్ కార్తీక్ మాత్రం టీమ్‌లోకి వస్తూ పోతూ 20 ఏళ్ల కెరీర్ కొనసాగించాడు...


Image credit: PTI

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోకముందే కామెంటేటర్‌గా మారిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఆర్‌సీబీ క్యాంపులో చేరి ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. గత సీజన్‌లో రెండో క్వాలిఫైయర్ ఆడి మూడో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ, ఈసారి దినేశ్ కార్తీక్ మీద భారీ అంచనాలే పెట్టుకుంది...
 

‘ధోనీ, నేను ఒకేసారి ఇండియా A తరుపున ఆడాం. ధోనీ కంటే ముందు నేనే టీమిండియాలోకి వచ్చాను. అయితే ధోనీ ఓ టూర్‌‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 148 పరుగులు చేయడంతో మాహీ మానియా మొదలైంది..
 

మాహీ మానియాలో మాలాంటి వికెట్ కీపర్లు ఎందరో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే నేనేం ఫీల్ కావడం లేదు. ఎందుకంటే ధోనీ అతనికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. నెం.1 వికెట్ కీపర్ అయ్యాడు...

తన పర్ఫామెన్స్‌తో హీరో అయ్యాడు. ఒకవేళ తన వల్ల నేను ఎక్కువ అవకాశాలు దక్కించుకోకపోయినా అది నాకు గర్వకారణమే. ఎందుకంటే ఓ నేషన్ హీరోతో నేను పోటీపడ్డానని గర్వపడతాను..’ అంటూ ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్.. 

Latest Videos

click me!