ఆస్ట్రేలియాలో సిరాజ్ దయనీయ పరిస్థితి... ఏడుస్తున్నా, ఓదార్చే వాళ్లు ఒక్కరూ లేక...

First Published Aug 21, 2021, 2:34 PM IST

బాధపడుతున్నప్పుడు మన కన్నీళ్లు తుడిచి, అక్కున చేర్చుకునే ఒక్కరు తోడుగా లేకపోతే... ఆ పరిస్థితి వర్ణనాతీతం... గత ఏడాది చివర్లో జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో అలాంటి దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్నాడు భారత క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్... తాజాగా విడుదలైన ఓ పుస్తకంలో సిరాజ్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి...

బోరియా మజుంబర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ కుశాన్ సర్కార్ రచించిన ‘మిషన్ డామినేషన్: ఎన్ అన్‌ఫినిష్డ్ క్వెస్ట్’ అనే పుస్తకంలో మహ్మద్ సిరాజ్ ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితుల గురించి రాసుకొచ్చారు... 

ఆస్ట్రేలియా టూర్‌లో గబ్బా టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు భారత జట్టు అద్వితీయ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్... లార్డ్స్ మైదానంలో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ రెండో టెస్టులో 8 వికెట్లు తీసి అదరగొట్టిన విషయం తెలిసిందే...

మహ్మద్ సిరాజ్ తండ్రి చనిపోయిన సమయంలో అతను ఆస్ట్రేలియాలో 14 రోజుల క్వారంటైన్‌ పీరియడ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో కఠినమైన క్వారంటైన్‌ రూల్స్ అమలులో ఉండడంతో రెండు వారాల పాటు మరో మనిషిని కలిసే అవకాశం కూడా దక్కలేదు...

ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన మిగిలిన ప్లేయర్ల సంగతి ఎలా ఉన్నా, ఈ 14 రోజులు మహ్మద్ సిరాజ్... ఆ గదిలో నరకాన్ని చూశాడు... తండ్రి లేడనే బాధ, ఆగని కన్నీళ్లు, మనసారా ఏడుద్దామంటే ఓదార్చే తోడు లేదు... మిరుమిట్లు కొలిపే విద్యుత్ దీపాల కాంతిలో ఆ హోటల్ గది వెలిగిపోతున్నా... అతనికి మాత్రం ఓ చీకటి గదిలో బంధించినట్టుగా అనిపించింది...

‘నవంబర్‌లో భారత జట్టు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నప్పుడు సిరాజ్ తండ్రి మరణించారు. అతని టీమ్‌ మేట్స్‌కి విషయం తెలిసినా, క్వారంటైన్ నిబంధనల కారణంగా సిరాజ్‌ను కలవలేరు, ఓదార్చలేరు... 

భారత క్రికెటర్లు క్వారంటైన్ ప్రోటోకాల్‌ను అతిక్రమిస్తారేమోననే ఉద్దేశంతో ప్రతీ క్రికెటర్ గది బయట పోలీసులను కూడా కాపలాగా పెట్టారు. ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను ఈ 14 రోజుల క్వారంటైన్ సమయంలో జైల్లో ఖైదీల్లా చూశారు... 

ఆ సమయంలో చాలాసార్లు సిరాజ్‌ మానసికంగా కృంగిపోయాడు. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఎవ్వరికైనా ఇది సహజం. కానీ సిరాజ్ మాత్రం డిప్రెషన్‌లోకి వెళ్లలేదు. మొండి పట్టుదలతో తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు...

తండ్రి లేడనే బాధను పంటి కింద దిగబట్టి, మరింత కసిగా ప్రాక్టీస్ చేశాడు... నాన్న లేడనే విషయం గుర్తుకువచ్చిన ప్రతిసారీ, కన్నీళ్లకు బదులుగా చెమట చిందించాలని నిర్ణయించుకున్నాడు... ఇంకా ఎక్కువ ప్రాక్టీస్, మరింత ఎక్కువగా చెమటోడ్చేవాడు...

మెల్‌బోర్న్ టెస్టులో అతనికి ఆ అవకాశం దక్కింది.... టీమిండియా విజయాల్లో నా కొడుకు కీలక పాత్ర పోషించాలనే తండ్రి కోరికను నేరవేర్చాలని నిర్ణయించుకున్నాడు... అతనికి విరాట్ కోహ్లీ, అండ్ టీమ్ సపోర్ట్ కూడా తోడయ్యింది...’ అంటూ ఈ పుస్తకంలో హైదరాబాదీ పేసర్ ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి రాసుకొచ్చారు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టుల్లో చోటు దక్కించుకున్నాడు. మొదటి టెస్టులో షమీ గాయపడడంతో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు సిరాజ్...

రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్, మూడో టెస్టు నుంచి తప్పుకోవడంతో సిడ్నీ టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్ వేశాడు మహ్మద్ సిరాజ్... మూడో టెస్టులో బుమ్రా, అశ్విన్, జడేజా వంటి కీ ప్లేయర్లు కూడా గాయపడి, జట్టుకి దూరమయ్యారు...

గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో భారత బౌలింగ్ విభాగానికి సారథ్యం వహించిన మహ్మద్ సిరాజ్... రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. మూడు టెస్టుల్లో 14 వికెట్లు తీసి, భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు...

click me!