నాగ్‌పూర్ టెస్టుకు నేను దూరం.. ఢిల్లీలో కలుస్తా : ఆసీస్‌కు బిగ్ షాకిచ్చిన స్టార్ పేసర్

First Published Jan 31, 2023, 1:20 PM IST

Border Gavaskar Trophy: ఫిబ్రవరి 9 నుంచి భారత్ తో నాలుగు టెస్టులు ఆడేందుకు గాను ఆస్ట్రేలియా జట్టు  టీమిండియాకు రానుంది.  తొలి టెస్టు జరిగే నాగ్‌పూర్ లో  ఆసీస్ కీలక పేసర్ లేకుండానే బరిలోకి దిగనుంది. 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  టీమిండియాతో నాలుగు టెస్టులు ఆడేందుకు గాను భారత్ లో ల్యాండ్ అయిన  ఆస్ట్రేలియా జట్టుకు ఇక్కడికి రాకముందే  భారీ షాక్ తాకింది. ఆ జట్టు కీలక పేసర్ మిచెల్ స్టార్క్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడే  వెల్లడించాడు. 

ఫిబ్రవరి 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉండగా ఈ మ్యాచ్  లో తాను ఆడటం లేదని, ఢిల్లీ (రెండో టెస్టు)లో సహచర ఆటగాళ్లను కలుస్తానని  స్టార్క్ ప్రకటించాడు.  సిడ్నీ వేదికగా  ఆదివారం ముగిసిన  క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డుల కార్యక్రమానికి హాజరైన  స్టార్క్.. తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. 
 

కార్యక్రమంలో హోస్ట్.. ‘స్టార్క్ నీ గాయం పరిస్థితి ఏంటి..?  నీ సహచరులతో పాటు ఇండియా వెళ్తున్నావా..? ’అని అడగ్గా  దానికి స్టార్క్ బదులిస్తూ.. ‘ప్రస్తుతానికి నేను ట్రాక్ లోనే ఉన్నా.  కానీ మరికొన్ని రోజులు  నేను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది.  నా సహచర క్రికెటర్లను  నేను ఢిల్లీలో కలుస్తా..  తొలి టెస్టులో వాళ్లు విజయం సాధిస్తారని ఆశిస్తున్నా.. ఆ తర్వాత వాళ్లతో కలిసి ప్రాక్టీస్ కొనసాగిస్తా ..’అని చెప్పాడు. 

భారత్  లో కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని,  అందుకు తాము సిద్ధమయ్యే వెళ్తున్నామని  స్టార్క్ చెప్పాడు. భారత్ లో పిచ్ లపై ఎలా ఆడాలన్నది అక్కడికి వెళ్లాకే తెలుస్తుందని,   స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై  రాణించేందుకు తమ ప్రణాళికలు తమకున్నాయని  చెప్పుకొచ్చాడు. కాగా  కొద్దిరోజుల క్రితం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ లో భాగంగా  స్టార్క్ గాయపడ్డ విషయం తెలిసిందే. అతడి చేతివేలికి గాయమైంది.  

నాలుగు మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి టెస్టు ఫిబ్రవరి 09న మొదలుకానుంది.  నాగ్‌పూర్ వేదిక (9-13) గా జరిగే ఈ టెస్టుతో సిరీస్ ఆరంభమవుతుంది. ఢిల్లీలో రెండో టెస్టు (17-21), ధర్మశాలలో మూడో టెస్టు (మార్చి 1-5), అహ్మదాబాద్ (9-13) లో నాలుగో టెస్టు జరుగనుంది.  టెస్టు సిరీస్ తర్వాత  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. 

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)  ఫైనల్ కు చేరాలంటే భారత్ కు  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకం. ఈ సిరీస్ లో భారత్.. ఆసీస్ ను 3-0 తో లేదా 2-1 తేడాతో ఓడిస్తేనే  డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. 

click me!