ఆసీస్ విధ్వంసక ఆటగాడిపై కన్నేసిన ముంబై, చెన్నై, హైదరాబాద్.. వేలంలో భారీ ధర పక్కా..!

First Published Sep 30, 2022, 2:12 PM IST

IPL 2023: ఇటీవలే ఇండియాతో ముగిసిన టీ20  సిరీస్ లో దుమ్మురేపిన యువ ఓపెనర్ కామెరూన్ గ్రీన్ పై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడింది. వచ్చే వేలంలో అతడిని దక్కించుకోవడానికి ఇప్పట్నుంచే ఫ్రాంచైజీలు పావులు కదుపుతున్నాయి. 

ఇండియన్ ప్రీమియర్  లీగ్ తర్వాత సీజన్ మొదలుకావడానికి ఇంకా ఆరు నెలల సమయముంది.  మార్చి మాసాంతంలో  2023 సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ కోసం జట్టును ఇప్పట్నుంచే సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి పలు ఫ్రాంచైజీలు. 
 

ముఖ్యంగా 2022 సీజన్ లో  దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు ఈసారి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని  భావిస్తున్నాయి. ఐపీఎల్  లో ముంబై ఇండియన్స్ 5 సార్లు ట్రోఫీ నెగ్గగా చెన్నై నాలుగు కప్పులు గెలుచుకుంది. కానీ ఐపీఎల్-15 సీజన్ లో ఈ రెండు జట్లూ చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి. 

దీంతో వచ్చే సీజన్ లో  అదిరిపోయే ప్రదర్శనలతో తిరిగి మునపటి  కీర్తిని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే  బలమైన జట్టును కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్ల ప్రదర్శన మీద కన్నేసి ఉంచిన ఈ ఫ్రాంచైజీల కన్ను తాజాగా ఆసీస్ యువ విధ్వంసకర ఆటగాడు కామెరూన్ గ్రీన్ మీద పడింది.  

డేవిడ్ వార్నర్ కు విశ్రాంతినివ్వడంతో  ఇండియా పర్యటనకు వచ్చిన ఈ యువ ఆల్ రౌండర్ సిరీస్ ఆధ్యంతం ఆకట్టుకున్నాడు. మొహాలీలో ముగిసిన తొలి మ్యాచ్ లో ఫించ్ తో ఓపెనింగ్ కు వచ్చి 30 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.  నాగ్‌పూర్ టీ20లో విఫలమైనా  హైదరాబాద్ లో 21 బంతుల్లోనే 52 పరుగులతో దుమ్ము రేపాడు.  
 

బంతిని అలవోకగా స్టాండ్స్ దాటించడంలో గ్రీన్ దిట్ట. బ్యాటింగ్ ఒక్కటే గాక అతడు బౌలింగ్ కూడా వేయగలడు. దీంతో ఇతడిని దక్కించుకోవడానికి చెన్నై, ముంబైలు ఇప్పటికే వ్యూహాలు పన్నుతున్నాయి.  ఈ రెండు ఫ్రాంచైజీలే గాక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా  గ్రీన్ ను దక్కించుకోవాలని చూస్తున్నది.  ధర ఎంతైనా సరే ఈ ఆల్ రౌండర్ ను వదులుకోవద్దనే భావనలో మూడు  ఫ్రాంచైజీలున్నాయి. 

నాణ్యమైన ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న గ్రీన్.. ఆస్ట్రేలియా తరఫున మరో షేన్ వాట్సన్ అవుతాడనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఈ ఏడాది  డిసెంబర్ లో జరుగనున్న ఐపీఎల్ మినీ వేలంలో గ్రీన్ ను దక్కించుకోవాలని ముంబై, చెన్నై, హైదరాబాద్ లు చూస్తున్నాయి. అయితే అతడు ఐపీఎల్ లోకి రావాలంటే  క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గ్రీన్ కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి.  సీఏ ఓకే చెబితే వచ్చే ఏడాది ఐపీఎల్ లో  గ్రీన్ మెరుపులు చూడొచ్చు. 

click me!