నాలుగో టెస్టులో ఆ ముగ్గురి రీఎంట్రీ, వికెట్ కీపర్‌గా బెయిర్ స్టో... మరింత పటిష్టంగా ఇంగ్లాండ్...

First Published Aug 30, 2021, 1:02 PM IST

మూడో టెస్టులో టీమిండియాను చిత్తు చేసి, సిరీస్‌ను సమం చేసిన ఇంగ్లాండ్ టీమ్, నాలుగో టెస్టు కోసం మరింత బలంగా మారేందుకు ఎత్తులు వేస్తోంది. మొదటి మూడు టెస్టుల్లో తుది జట్టులో మార్పులు చేసిన ఇంగ్లాండ్ జట్టు... నాలుగో టెస్టులోనూ మూడు మార్పులతో బరిలో దిగుతోంది...

రెండో టెస్టులో గాయపడిన మార్క్ వుడ్, గాయం నుంచి కోలుకుని తుదిజట్టులోకి తిరిగి వచ్చాడు. మార్క్ వుడ్ రీఎంట్రీతో మూడో టెస్టులో మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా, ఓవర్టన్‌కి నాలుగో టెస్టులో చోటు దక్కకపోవచ్చు...

ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌కి కూడా నాలుగో టెస్టు జట్టులో చోటు దక్కింది. 2020లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి, ‘ఇంగ్లాండ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన క్రిస్ వోక్స్, రొటేషన్ పాలసీ కారణంగా దాదాపు ఏడాది తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. 

వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్‌కి కూడా 15మంది జట్టులో చోటు కల్పించింది ఇంగ్లాండ్ జట్టు... అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే మారింది...

రెగ్యూలర్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, నాలుగో టెస్టుకి దూరం కానున్నాడు. బట్లర్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతుండడంతో జోస్ బట్లర్, కొన్నాళ్ల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...

బట్లర్ స్థానంలో జానీ బెయిర్ స్టో వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. బెయిర్ స్టో గాయపడితే, కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా సామ్ బిల్లింగ్స్‌ను సిద్ధంగా ఉంచింది ఇంగ్లాండ్ జట్టు.

‘జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకి దూరంగా ఉంటున్నాడు. ఐదో టెస్టుకి అతను అందుబాటులో వస్తాడు. నాలుగో టెస్టుకి మాత్రం జానీ బెయిర్ స్టో వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్.

వరుసగా మూడు టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్‌కి రొటేషన్ పాలసీ ప్రకారం రెస్ట్ ఇవ్వాలని భావించినా, మరో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయం కారణంగా అందుబాటులో లేడు. బ్రాడ్ లేకపోవడంతో అండర్సన్ నాలుగో టెస్టులో కూడా ఆడే అవకాశం ఉంది...

నాలుగో టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు ఇదే: జో రూట్, మొయిన్ ఆలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, రోరీ బర్న్స్, సామ్ కుర్రాన్, హసీబ్ హమీద్, డాన్ లారెనస్, డేవిడ్ మలాన్, ఓవర్టన్, ఓల్లీ పోప్, రాబిన్‌సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

click me!