Legends Cricket League: క్రేజీ క్రికెట్ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బీ.. జనవరి నుంచే మ్యాచులు స్టార్ట్!

First Published Dec 9, 2021, 4:56 PM IST

Amitabh Bachchan: క్రికెట్ లో పాత శత్రువులను మళ్లీ కలుపుతూ.. దిగ్గజాల ఆటను మళ్లీ ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. ఓ లీగ్ రాబోతున్నది.  జనవరి లో ప్రారంభం కాబోయే ఈ లీగ్ కు బాలీవుడ్ బిగ్ బీ  అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండనున్నారు. 

పలు దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు, సీనియర్లతో కలిసి నిర్వహిస్తున్న  లెజెండరీ క్రికెట్ లీగ్ కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. 

ఈ మేరకు అమితాబ్ బచ్చనే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ లీగ్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పాత శత్రువులంతా తిరిగి వాళ్ల వైరాన్ని క్రికెట్ గ్రౌండ్ లో తీసుకువస్తారు. 

క్రికెట్ అభిమానులంతా ఈ  దిగ్గజాల ఆట చూడటానికి గొప్ప అవకాశం..’ అని అమితాబ్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ లీగ్ మొదలయ్యే అవకాశముంది. 

2022 జనవరిలో ఓమన్ లోని అల్ అమెరట్ క్రికెట్ స్టేడియంలో  లెజెండరీ క్రికెట్ లీగ్ ను నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. ఇందులో మొత్తం 3 జట్లుంటాయి. 

అవి.. 1. ఇండియా 2. ఆసియా 3. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ కు చెందిన పలువురు లెజెండరీ ఆటగాళ్లు ఈ లీగ్ లో  ఆడనున్నారు. 

అయితే ఈ లీగ్ లో ఆడే ఆటగాళ్ల పేర్లు మాత్రం ఇప్పటివరకూ బయటకు రాలేదు. లీగ్  నిర్వాహకులు ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. 

ఇక ఈ లీగ్ కు అమితాబ్ బచ్చన్ అంబాసిడర్ గా వ్యవహిరించడంపై లెజెండ్స్ లీగ్ క్రికెట్ చైర్మెన్ వివేక్ ఖుషాలానీ మాట్లాడుతూ.. ‘ఆయన లెజెండ్. అమితాబ్ మాతో చేతులు కలుపుతుండటం ఈ లీగ్ కు మరింత విలువ పెంచుతున్నది. అంతేగాక ఈ లీగ్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతం కావడానికి ఆయన అనుభవం, క్రేజ్ మాకు ఎంతగానో తోడ్పడుతాయి..’ అని అన్నాడు. 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో రామన్ రహేజా మాట్లాడుతూ.. ‘మిస్టర్ బచ్చన్ సాబ్ మాతో ఉండటం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన గ్లోబల్ ఐకాన్. ఆయన రాకతో మా లీగ్ విలువ అమాంతం పెరిగింది..’ అని చెప్పాడు. 

click me!