KL Rahul: పంజాబ్ కు రాహుల్ గుడ్ బై..? ఆ కొత్త జట్టుతో భారీ డీల్.. మూడేండ్ల పాటు ఆ ఫ్రాంచైజీతోనే..!

First Published Nov 25, 2021, 12:56 PM IST

IPL 2022 Auction: ఫార్మాట్ ఏదైనా  అందుకు తగ్గట్గుగా రాణిస్తున్న టీమిండియా టీ20 వైస్ కెప్టెన్  కెఎల్ రాహుల్.. నాలుగేండ్లుగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబ్ సూపర్ కింగ్స్ ను వీడనున్నాడు. త్వరలో జరిగే ఐపీఎల్ వేలంలో అతడిని దక్కించుకోవడానికి  ఇటీవలే లీగ్ లోకి  ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్టు  అమితాసక్తి చూపుతున్నది. 

గత నాలుగు సీజన్లుగా పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ త్వరలోనే ఆ జట్టును వీడనున్నాడు. ఇదివరకే ఇందుకు సంబంధించిన గుసగుసలు వినిపించినా ఐపీఎల్ వేలం నేపథ్యంలో పంజాబ్ యాజమాన్యం రాహుల్  తో  తెగదెంపులు చేసుకున్నట్టు సమచారం. 

మరి పంజాబ్ ను వీడిన ఈ కర్నాటక బ్యాటర్.. ఐపీఎల్ లో ఏ జట్టు తరఫున ఆడతాడనేది ఇప్పుడు అతడి అభిమానులతో పాటు క్రికెట్  ఫ్యాన్స్ ను తొలిచివేస్తున్న ప్రశ్న. అయితే రాహుల్.. పంజాబ్ ను వీడతాడని వార్తలు వచ్చినప్పట్నుంచి.. సోషల్ మీడియాలో అతడు ముంబై ఇండియన్స్ ను ఫాలో అవుతున్నాడు. 

భారత జట్టు తరఫున హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్న రాహుల్.. ముంబైకి ఆడుతాడా..? అనే అనుమానాలు తలెత్తాయి. అంతేగాక అతడి సొంత రాష్ట్రానికి చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రాహుల్ తో సంప్రదింపులు జరిపినట్టు గతంలో వార్తలు వచ్చాయి.  అయితే   ఈ వార్తలపై ఇంతవరకు రాహుల్ గానీ,  ఆయా జట్ల యాజమాన్యాలు గానీ స్పందించలేదు. 

కాగా తాజా కథనాల ప్రకారం.. వచ్చే ఐపీఎల్ నుంచి కొత్తగా చేరబోతున్న లక్నో ఫ్రాంచైజీ తరఫున రాహుల్ ఆడనున్నట్టు  విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ జట్టుకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే రాహుల్ తో పలుమార్లు చర్చలు కూడా జరిపారని తెలుస్తున్నది. 

మూడేండ్ల పాటు జట్టుతో ఉండేందుకు రాహుల్ తో లక్నో ఫ్రాంచైజీ భారీ డీల్ కుదుర్చుకున్నట్టు  సమాచారం. ఇంకా పేరు పెట్టని లక్నో ఫ్రాంచైజీకి రాహులే  సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 

గత నెలలో ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల బిడ్ ల వేలంలో రూ. 7,090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ఆర్పీఎస్జీ కంపెనీ.. ఈ లీగ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నది.  ఫ్రాంచైజీ కొనడానికి భారీగా వెచ్చించిన ఆ జట్టు అధినేత సంజీవ్ గొయెంకా.. ఐపీఎల్ లో  లక్నోను తిరుగులేని జట్టుగా తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.

ఇక రాహుల్ విషయానికొస్తే.. గత కొద్దికాలంగా అతడు ఐపీఎల్ తో పాటు టీమిండియా తరఫున మోస్ట్ సక్సెస్ఫుల్ ఆటగాడు. అన్ని ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తున్న రాహుల్.. ఐపీఎల్ లో  అయితే చెలరేగిపోతున్నాడు. గత నాలుగు సీజన్లలో అతడు 550 కి పైగా పరుగులు సాధించడం విశేషం.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14 లో 13 ఇన్నింగ్స్ లో ఏకంగా 626 పరుగులు చేశాడు. అంతేగాక నాలుగు సార్లు ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు.

టీ20 ఫార్మాట్ లో రాహుల్ కు మంచి రికార్డుంది. నెమ్మదిగా మొదలెట్టి తర్వాత విజృంభించే అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. వరుస సిరీస్ లలో రాణిస్తుండటంతో  రాహుల్ ఇటీవలే టీమిండియా వైస్ కెప్టెన్ (టీ20 జట్టుకు)  గా కూడా ఎంపికయ్యాడు.

click me!