IPL Auction: ముంబై రిటైన్ చేసుకునేది వీళ్లనే.. ఆ స్టార్ ఆటగాడికి ప్లేస్ డౌటేనా..?

First Published Nov 25, 2021, 11:53 AM IST

IPL Mega Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏ ఏ ఆటగాడు ఏ జట్టు తరఫున ఆడతాడనే విషయాల మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టు నిలుపుకోబోయేది వీళ్లే..

మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ మెగావేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే.  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ  వేలానికి ముందే ఆయా జట్లు తాము నిలుపుకోబోయే  ఆటగాళ్ల జాబితాను  అందజేయాల్సి ఉంటుంది.  ఇందుకు నవంబర్ 30 ఆఖరు తేదిగా నిర్ణయించారు. 

అయితే ఎవరిని అట్టిపెట్టుకోవాలి..? ఎవరిని సాగనంపాలి..? అనే విషయమ్మీద ఆయా జట్లు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈసారి ఐపీఎల్ లోకి  రెండు కొత్త జట్లు వస్తుండటంతో పాత జట్లు (8)  నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే  అవకాశముంది. 

ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ ఎవరిని నిలుపుకుంటుంది..? ఎవరిని వదలుకుంటుంది..? ఎవరిని వేలంలోకి వదిలేయనుంది..? అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే తాజా రిపోర్డుల ప్రకారం.. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ,  పేసర్ జస్ప్రీత్ బుమ్రా లతో పాటు ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ లను కూడా ముంబై రిటైన్ చేసుకుంటున్నట్టు సమాచారం.  అయితే నాలుగో స్థానం కోసం యువ ఆటగాడు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

ఈ ఇద్దరిలో ఇషాన్ కిషన్ వైపే ముంబై యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. అయితే సూర్య ను కూడా వదులుకోవడానికి ముంబై ఆసక్తి  చూపడం లేదు. అతడిని వేలంలో దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ  మేరకు ఇప్పటికే  సూర్యతో చర్చలు కూడా సాగిస్తున్నట్టు సమాచారం. 

ఇక విదేశీ ఆటగాళ్లలో ఒక్కరినే నిలుపుకునేందుకు అవకాశం ఉండటంతో పొలార్డ్ ను దక్కించుకోవడం ఖాయమైంది. మరి సుదీర్ఘకాలంగా  ఆ  జట్టుకు ఆడుతున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ట్రెంట్ బౌల్ట్ ల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు సస్పెన్స్. 

ఇక ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఈసారి వదులుకోవడం లాంఛనమే. గతేడాది  వెన్నునొప్పి గాయం కారణంగా  శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత పాండ్యా మునుపటి ఫామ్ ను కోల్పోవడమే గాక బౌలింగ్ కూడా చేయడం కష్టంగా  మారింది. అదీగాక ఇటీవల ముగిసిన టీ20  ప్రపంచకప్ లో పాండ్యా ఫిట్నెస్, ఆటపై  తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆ జట్టు పాండ్యాను వదిలించుకుంటుందని అప్పుడే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతడితో పాటు కృనాల్  పాండ్యా ను కూడా వదులుకోవాలనే ముంబై యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 

ఇదిలాఉండగా.. కోల్కతా నైట్ రైడర్స్ కూడా తాము ఎవరిని రిటైన్ చేసుకోవాలనేదానిమీద తీవ్ర కసరత్తు  చేస్తున్నది. ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు ఈసారి ఉద్వాసన తప్పదని ఇప్పటికే మేనేజ్మెంట్ పలు హింట్లు కూడా ఇచ్చింది. అయితే  చాలాకాలంగా ఆ జట్టు తరఫున ఆడుతున్న  విండీస్ ద్వయం సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ ను మాత్రం వదులుకోవడానికి కోల్కతా సిద్ధంగా లేదు.  మరి వీళ్లిద్దరిలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక ఆ జట్టు ఓపెనర్,  నయా సంచలనం వెంకటేశ్ అయ్యర్, శుభమన్ గిల్ తో కూడా  కోల్కతా యాజమాన్యం చర్చలు చేస్తున్నది.  ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో కోల్కతాను ఫైనల్ కు చేర్చడంలో వీళ్లిద్దరి పాత్ర కీలకం. ఏదేమైనా ఈ నెల 30 వరకు ఏ జట్లు ఎవరిని నిలుపుకుంటాయనేదానిమీద ఓ స్పష్టత రానుంది. 

click me!