నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది... భారత ఆటగాడిపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కామెంట్...

First Published Nov 25, 2021, 12:31 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెటర్ల కెరీర్ గ్రాఫ్‌ను మార్చడమే కాదు, అంతర్జాతీయ క్రికెటర్ల మధ్య ఉన్న అంతరాలను కూడా చెరిపివేసింది. లీగ్‌లో కలిసి ఆడే క్రికెటర్లు, ప్రాణ స్నేహితులుగా, ఆత్మీయ మిత్రులుగా మారడం చూస్తూనే ఉన్నాం...

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, తాజాగా ఓ భారత ఆటగాడి టెస్టు ఎంట్రీపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

రోహిత్ శర్మకు టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వడం, కెఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడం, భారత సారథి విరాట్ కోహ్లీ తొలి టెస్టు ఆడకపోవడంతో కాన్పూర్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌కి తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది...

భారత జట్టు తరుపున టెస్టు క్రికెట్‌లో ఆడబోతున్న 303వ ఆటగాడిగా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. అంతేకాదు 2003లో యువరాజ్ సింగ్ తర్వాత న్యూజిలాండ్‌పై టెస్టు ఎంట్రీ చేసిన భారత క్రికెటర్ కూడా అయ్యరే...

26 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్, భారత మాజీ కెప్టెన్, క్రికెటర్, ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ నుంచి టెస్టు క్యాప్ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్‌కి అజిత్ అగార్కర్ క్యాప్ అందించగా, శ్రేయాస్ అయ్యర్‌కి సునీల్ గవాస్కర్ క్యాప్ అందించాడు...

2017లో టీమిండియా తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్‌, గవాస్కర్ ఇచ్చిన టెస్టు క్యాప్‌ను ముద్దాడి, ధరించి... ఎమోషనల్‌ అయ్యాడు...

‘కొన్నేళ్లుగా నువ్వు పడుతున్న కష్టాన్ని, నీ అంకిత భావాన్ని దగ్గర్నుంచి చూస్తున్నా. నువ్వు ఈ అవకాశానికి అర్హుడివి. ఈ కేవలం ఆరంభం మాత్రమే... నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది శ్రేయాస్ అయ్యర్...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్, ఆ జట్టును లీగ్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ చేర్చాడు. అయితే గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌ను మిస్ అయిన అయ్యర్, పంత్ కెప్టెన్సీ కారణంగా సెకండాఫ్‌లో ప్లేయర్‌గానే ఆడాడు...

54 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 52.18 సగటుతో 4592 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌కి దేశవాళీల్లో 12 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 202 పరుగులు నాటౌట్‌...

సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ స్థానంపై అనిశ్చితి నెలకొంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అయ్యర్‌కి అవకాశం దక్కినా, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తే, శ్రేయాస్‌కి చోటు దక్కడం అనుమానమే...

అంతేకాకుండా ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోవడం కష్టమేనని ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్ చేశాడు...

కెప్టెన్‌గా అదరగొట్టిన రిషబ్ పంత్‌తో పాటు శిఖర్ ధావన్, పృథ్వీషా, కగిసో రబాడాలను మాత్రమే రిటైన్ చేసుకునే ఆలోచనలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమన్యం ఉన్నట్టు సమాచారం..

click me!