టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు.. కివీస్‌తో సిరీస్ నాటికి ఫిట్..?

First Published Dec 17, 2022, 6:30 PM IST

ఈ ఏడాది జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లొచ్చాక బుమ్రా  గాయపడ్డాడు. వెన్నునొప్పి గాయంతో బుమ్రా ఆసియా కప్ కు దూరమయ్యాడు. రవీంద్ర జడేజా ఆసియాకప్ లో పాకిస్తాన్ తో  ఆడిన తొలి మ్యాచ్ లో పాల్గొన్న తర్వాత కాలిగాయంతో ఇంటికి తిరిగొచ్చాడు. 

టీ20  ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లో ఓడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి కీలక ఆటగాళ్లు లేకపోవడం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లు ఉంటే  పరిస్థితి మరో విధంగా ఉండేదన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.   ఈ ఏడాది గాయాల కారణంగా వీళ్లు ఆడింది తక్కువ  విశ్రాంతి తీసుకున్నదే ఎక్కువ. 

ఈ ఏడాది జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లొచ్చాక బుమ్రా  గాయపడ్డాడు. వెన్నునొప్పి గాయంతో బుమ్రా ఆసియా కప్ కు దూరమయ్యాడు. ఇదే క్రమంలో టీ20 ప్రపంచకప్ కు ముందు  స్వదేశంలో  సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ లలో బుమ్రాను బలవంతంగా ఆడించినా టీమ్ మేనేజ్మెంట్ దానికి ఫలితం అనుభవించింది.  సరిగ్గా టీ20 ప్రపంచకప్ కు ముందు  బుమ్రాకు గాయం తిరగబెట్టింది. దీంతో  అతడు మళ్లీ టీమ్ ను వీడాడు.

ఇక రవీంద్ర జడేజా విషయానికొస్తే  ఆసియాకప్ లో పాకిస్తాన్ తో  ఆడిన తొలి మ్యాచ్ లో పాల్గొన్న జడేజా తర్వాత కాలిగాయంతో ఇంటికి తిరిగొచ్చాడు. కాలికి ఆపరేషన్ చేయించుకుని  కొన్నాళ్లు  ఎన్సీఏలోనే గడిపాడు.  టీ20 ప్రపంచకప్ కూ దూరమైన జడేజా..  తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపికై తర్వాత తన భార్య ఎన్నికల కారణంగా  తప్పుకున్నాడు. 

అయితే  ఈ ఇద్దరూ ఇప్పుడు మళ్లీ భారత జట్టుతో చేరడానికి సిద్ధమవుతున్నట్టు  తెలుస్తున్నది.  బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు కొద్దిరోజుల పాటు ఎన్సీఏలో ట్రైనింగ్ తీసుకున్న బుమ్రా.. పూర్తి ఫిట్నెస్ సాధించాడట.  ప్రస్తుతం నెట్స్ లో శ్రమిస్తున్న  వీడియోను కూడా బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాడు. గతంలో మాదిరిగానే బౌలింగ్ లో రిథమ్ అందుకున్నట్టుగా  బుమ్రా కనిపిస్తున్నాడు.

ఇక ఇటీవలే ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తన భార్యను గెలిపించుకున్న జడేజా.. ఆ టాస్క్ ముగియడంతో తిరిగి జట్టుతో చేరడానికి సన్నద్ధమవుతున్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపికైనా ఫిట్ గా లేననే కారణం చెప్పి తప్పుకున్న జడేజా.. త్వరలోనే ఎన్సీఏ కి వెళ్లనున్నాడు. అక్కడ ఫిట్నెస్ టెస్టుకు  సిద్ధమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

ఈ ఇద్దరూ జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ పర్యటనలో తుదిజట్టులో ఉంటారని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.   జడేజా కాస్త టైమ్ తీసుకున్నా బుమ్రా మాత్రం   న్యూజిలాండ్ కంటే ముందు జరుగబోయే లంకతో సిరీస్ లోనే టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ఎన్సీఏ ఫిజియోలు. మరి వీళ్లిద్దరూ ఎంత ఫిట్ గా ఉన్నారు..?  ఎన్సీఏ, బీసీసీఐ వర్గాలు చెప్పినట్టు న్యూజిలాండ్ సిరీస్ లో ఆడతారా..? లేక  విశ్రాంతికే పరిమితమవుతారా..? అన్నది త్వరలోనే తేలనుంది. 
 

click me!