సిరీస్ ఓడినా అతడు తోపు కెప్టెన్ అన్న గంభీర్.. సఫారీ టూర్ చూడలేదా..? అంటూ నెటిజన్ల చురకలు

First Published Jan 24, 2022, 6:10 PM IST

Gautam Gambhir Lauds KL Rahul: టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలపై పలువురు భారత మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు గౌతం గంభీర్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. 

దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్ గా అట్టర్ ఫ్లాఫ్ అయిన టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ కెప్టెన్సీ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఐపీఎల్ లో మాదిరే అతడు భారత జట్టులో కూడా నాయకుడిగా విఫలమవుతాడని అప్పుడే క్రికెట్  పండితులు విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు. 
 

ఈ నేపథ్యంలో రాహుల్ త్వరలో నాయకుడిగా బాధ్యతలు చేపట్టబోయే లక్నో ఫ్రాంచైజీకి మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరిది ఓ దారైతే తనది ఓ దారి అనిపించుకునే విధంగా వ్యాఖ్యానించే గంభీర్ తాజా వ్యాఖ్యలు కూడా అలాగే  ఉన్నాయి.

గంభీర్ స్పందిస్తూ... ‘కెఎల్ రాహుల్ విషయానికొస్తే పెద్దగా ఆలోచించాల్సిన పన్లేదు. అతడు  మంచి బ్యాటరే కాదు గొప్ప నాయకుడు కూడా. అతడు ఇప్పుడిప్పుడే (టీమిండియా ఓటమి నేపథ్యాన్ని ఉద్దేశిస్తూ..) కుదురుకుంటున్నాడు.  

అతడు ఓపెనింగ్ చేయగలడు. వికెట్లను కాపాడుకోగల నేర్పరి.  పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడి రికార్డులను చూడండి.. రాహుల్ ఏంటనేది తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా అతడు నిలకడగా ఆడుతున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్, ఇతర జట్లకు  ఆడుతున్నప్పుడు అతడు ఏ విధంతా రాణించాడో చూడండి.  ఐపీఎల్  లో ఫ్రాంచైజీల తరఫున బ్యాటర్ గా మెరుగైన ప్రదర్శనలను భారత జట్టులో కూడా చేసి చూపిస్తాడు..’ అని అన్నాడు. 

వచ్చే ఐపీఎల్ లో  లక్నో జట్టు తరఫున సారథిగా ఎంపికైన కెఎల్ రాహుల్ ను ఆ ఫ్రాంచైజీ రూ. 17 కోట్లు పోసి  దక్కించుకున్న విషయం తెలిసిందే.  అదే క్రమంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ను రూ. 9.2 కోట్లకు, రవి బిష్ణోయ్ ను రూ. 4 కోట్లకు దక్కించుకుంది. 
 

కాగా.. గంభీర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ భీభత్సమైన ట్రోలింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా తో ముగిసిన మూడు వన్డేలను చూడలేదా..? లేక ఆ సిరీస్ లో భారత్ ఓడిపోయిన విషయాన్ని మరిచిపోయాడా..? అని కామెంట్లు చేస్తున్నారు. 
 

టీమిండియా మాజీ టెస్టు సారథి కోహ్లి గైర్హాజరీలో రెండో టెస్టుకు సారథ్యం వహించిన రాహుల్.. ఆ టెస్టుతో పాటు వరుసగా మూడు వన్డేలలో ఓడాడు. దీంతో అతడి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

గతంలో ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్  కూ కెప్టెన్ గా పనిచేసిన రాహుల్.. 27 మ్యాచులకు గాను 11 మ్యాచులనే గెలిపించాడు. బ్యాటర్ గా అద్భుతమైన  ఫామ్ ఉన్నా నాయకుడిగా మాత్రం రాహుల్  అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. కెప్టెన్ సంగతి పక్కనబెడితే.. వన్డే సిరీస్ లో  బ్యాటర్ గా కూడా రాహుల్ ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన మినహా ఈ పర్యటనలో  అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. ఇక మూడు వన్డేలలో కూడా ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు.  

click me!