IPL 2025 LSG vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా 40వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో టీమ్ కు షాకిచ్చింది. తనను వద్దనుకున్న ఫ్రాంఛైజీ టీమ్ పై కేఎల్ రాహుల్ అద్భుమైన ఆటతో ఢిల్లీ జట్టు కోసం విన్నింగ్ పరుగులు కొట్టాడు. తనను అవమానించిన గ్రౌండ్ లోనే బ్యాట్ తో సమాధానమిచ్చాడు.
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఢిల్లీ అందుకుంది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్ 51 పరుగులు, కేఎల్ రాహుల్ 57 పరుగులు, అక్షర్ పటేల్ నాటౌట్‌గా నిలిచి ఢిల్లీకి విజయాన్ని అందించారు.
పవర్ ప్లేలో ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరుకుంది. కరుణ్ నాయర్ 9 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ నెమ్మదిగా ప్రారంభించి దూకుడు పెంచాడు. అభిషేక్ పోరెల్ తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు.
అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 51 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో దృఢంగా నిలిచిన రాహుల్ ఓపికగా ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. కేఎల్ రాహుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 20 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. ఐడెన్ మార్క్రామ్ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేకపోయారు.
27 కోట్ల రూపాయల ప్లేయర్ అయిన రిషబ్ పంత్ ఒక్క పరుగు కూడా చేయలేదు. చివరలో ఆయూష్ బదోని దూకుడుగా ఆడి 36 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో లక్నో జట్టు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా, కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో సహనం కోల్పోయినట్టు కనిపించాడు. టీమ్ లోని ప్లేయర్లపై గ్రౌండ్ లో అరుస్తూ కనిపించాడు. అలాగే, లక్నో ఓటమికి కారణం అయ్యేలా మారింది పంత్ తీసుకున్న ఒక బిగ్ డిసెషన్. లక్నో టీమ్ కు మిచెల్ మార్ష్, మార్క్రామ్ లు అద్భతమైన ఆంరంభం అందించారు.
కానీ, మార్క్రామ్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రాకుండా అబ్దుల్ సమద్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్లను ముందుగా బ్యాటింగ్ కు పంపాడు. చివరి ఓవర్ లో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. దీంతో పంత్ పై విమర్శలు వస్తున్నాయి.
KL Rahul (Photo- IPL)
లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానికి చేరుకుంది. డీసీ 8 మ్యాచ్ లు ఆడి వీటిలో 6 మ్యాచ్ లను గెలుచుకుని 12 పాయింట్లు సాధించింది. మరో రెండు మ్యాచ్ లను కోల్పోయింది.
టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు కూడా 12 పాయింట్లు ఉన్నాయి కానీ, నెట్ రన్ రేటు మెరుగ్గా ఉండటంతో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. మూడో నాలుగు స్థానాల్లో వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. లక్నో టీమ్ 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.