అరుదైన ఘనత అందుకున్న విండీస్ వీరుడు.. టీ20లలో ఎవరికీ దక్కని రికార్డు పొలార్డ్ సొంతం

First Published Aug 9, 2022, 3:40 PM IST

Kieron Pollard: వెస్టిండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ లో మరెవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 
 

ఐపీఎల్-15 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు వెస్టిండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా అతడు ఫ్రాంచైజీ క్రికెట్ లో కొనసాగుతానని చెప్పాడు. ఐపీఎల్ ముగిశాక కొన్ని రోజులు విరామం తీసుకున్న అతడు.. తాజాగా ది హండ్రెడ్ లీగ్ లో ఆడుతున్నాడు. 

ఈ క్రమంలో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్ లో 600వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా తన పేరును క్రికెట్ పుస్తకాలలో  సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ది హండ్రెడ్ లీగ్ లో భాగంగా.. లండన్ స్పిరిట్స్ తరఫున ఆడుతున్న  పొలార్డ్.. మాంచెస్టర్ ఒరిజినల్స్ తో మ్యాచ్ ఆడుతూ ఈ ఘనతను అందుకున్నాడు.  

ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్ పొలార్డ్.  2007 నుంచి  క్రికెట్ ఆడుతున్న పొలార్డ్ ఆటశైలికి ఈ ఫార్మాట్ బాగా సరిపోతుంది. దీంతో అతడు టెస్టులు, వన్డేల కంటే ఈ పార్మాట్ లోనే ఎక్కువ క్రికెట్ ఆడాడు.

తన అంతర్జాతీయ కెరీర్ లో పొలార్డ్..  వెస్టిండీస్ తరఫున 123 వన్డేలు ఆడాడు. 101 టీ20లు ఆడాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఫ్రాంచైజీ క్రికెట్ జరిగినా కనిపించే పేరు పొలార్డ్‌ది అనడంలో సందేహమే లేదు. టీ20లలో అత్యంత విజయవంతమైన ఆల్ రౌండర్లలో పొలార్డ్ ముందువరుసలో ఉంటాడు. 

తన అంతర్జాతీయ కెరీర్ లో పొలార్డ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు  ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ గా  గుర్తించబడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అతడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.

ఆసీస్ వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్ లో  అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో డాకా గ్లాడియేటర్స్‌, డాకా డైనమిటీస్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో కరాచీ కింగ్స్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌, పెషావర్‌ జాల్మికి ప్రాతినిథ్యం వహించాడు.

పొలార్డ్ తర్వాత టీ20లలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన వారి జాబితాలో డ్వేన్ బ్రావో (543 మ్యాచ్ లు), షోయభ్ మాలిక్ (472 మ్యాచ్ లు),  క్రిస్ గేల్ (463), రవి బొపారా (426) ఉన్నారు. వీరిలో బ్రావో, గేల్ లు కూడా విండీస్ వీరులే కావడం గమనార్హం. 

click me!