టీమిండియాను గెలికిన పాకిస్తాన్... కశ్మీర్ ప్రీమియర్ లీగ్ పేరుతో... బీసీసీఐ నిర్ణయంపై...

First Published Aug 1, 2021, 12:25 PM IST

భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న దాయాదుల సమరం, క్రికెట్‌లోనూ పాకింది. భారత్‌లో భాగమైన కశ్మీర్ పేరుతో ఓ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో మరోసారి ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది...

ఐపీఎల్ సూపర్ సక్సెస్ తర్వాత పీసీబీ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీసీఎల్) తీసుకొచ్చింది. ఐపీఎల్ అంత కాకపోయినా పాక్ సూపర్ లీగ్‌కి కూడా ఆదరణ బాగానే ఉంది. అయితే ఇది సరిపోదన్నట్టుగా కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)ను ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తోంది పీసీబీ...

పొరుగు దేశం వాడు ఎన్ని లీగ్‌లు పెట్టుకుంటే మాత్రం మనకేంటి కానీ, భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్ పేరును వాడడంపై భారత్‌ సీరియస్ అయ్యింది. కేపీఎల్‌లో ఆడే ఏ క్రికెటర్‌ కూడా, భారత్‌లోకి క్రికెట్ సంబంధిత వ్యవహారాల కోసం వచ్చేందుకు అనుమతి ఉండదంటూ తేల్చేసింది...

భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్ టోర్నీలతో పాటు క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో ఆడేందుకు, పాల్గొనేందుకు అవకాశం ఉండదంటూ హెచ్చరికలు జారీ చేసిందంటూ వార్తలు వచ్చాయి... బీసీసీఐ నుంచి అయితే అధికారిక ప్రకటన కానీ, నోటీస్ కానీ విడుదల కాలేదు.

భారత క్రికెటర్లు, విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా అలా పాల్గొంటే, వారికి ఐపీఎల్ సహా, బీసీసీఐ అనుబంధ దేశీ లీగుల్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉండదు. అయితే విదేశీ క్రికెటర్లపై మాత్రం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ పెట్టింది లేదు...

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్, ఈ విషయంపై ట్వీట్ చేయడంతో కేపీఎల్ విషయంలో వివాదానికి తెర లేచింది... ‘బీసీసీఐకి పాకిస్తాన్‌లో ఎలాంటి రాజకీయ విభేదాలనైనా ఉండొచ్చు. కానీ వాటిని క్రికెట్‌లోకి తీసుకొచ్చి కేపీఎల్ ఆడకూడదని బెదిరించడం సరికాదు. ఒకవేళ కేపీఎల్ ఆడితే, నన్ను భారత్‌లోకి ఏ క్రికెట్ సంబంధిత పనుల కోసం రానివ్వమంటూ హెచ్చరిస్తున్నారు. ఇది దారుణం’ అంటూ ట్వీట్ చేశాడు హర్షల్ గిబ్స్...

హర్షల్ గిబ్స్ ట్వీట్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఈ విషయంపై బీసీసీఐ ధోరణిని ప్రశ్నిస్తూ ఐసీసీకి లేఖ రాసింది. ‘కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో రిటైర్డ్ క్రికెటర్లను ఆడనివ్వకుండా బీసీసీఐ బెదిరిస్తోందని, ఆడితే భారత్‌లోకి రానివ్వమంటూ హెచ్చరిస్తూ బెదిరింపులకు పాల్పడడం సరికాదంటూ’ ఓ లేఖ రాసింది...
undefined
అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. అయినా పాక్ క్రికెట్ బోర్డు పంపే నోటీసులకు బీసీసీఐ ఏనాడూ ఖాతరు చేసింది లేదు. ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ పీసీబీ, ఐసీసీని ఆశ్రయిస్తే... నయా పైసా ఇవ్వమంటూ తేల్చేసింది బీసీసీఐ...
undefined

ఆగస్టు 6 నుంచి కశ్మీర్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానుంది. ముజఫరాబాద్‌లో జరిగే ఈ టోర్నీలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని క్రికెటర్లు పాల్గొంటారు. ఈ టోర్నీలో హర్షల్ గిబ్స్‌తో పాటు లంక మాజీ క్రికెటర్ దిల్షాన్ పాల్గొనబోతున్నాడని సమాచారం.

click me!