కపిల్‌దేవ్, టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సరసన చేరనున్న శిఖర్ ధావన్...

First Published | Jun 28, 2021, 5:10 PM IST

శ్రీలంక టూర్‌లో పర్యటించే భారత జట్టుకి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహారించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 65 టీ20, 142 వన్డే, 34 టెస్టులు ఆడిన శిఖర్ ధావన్... భారత మాజీ లెజెండరీ కెప్టెన్ల సరసన చేరబోతున్నాడు...

భారత జట్టుకి మొట్టమొదటి వరల్డ్‌కప్ సాధించిన కెప్టెన్ కపిల్‌దేవ్‌తో పాటు ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్, ‘కింగ్’ విరాట్ కోహ్లీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కూడా కెప్టెన్లుగా తమ మొట్టమొదటి మ్యాచ్‌ లంకపైనే ఆడడం విశేషం...
భారత జట్టులో ఆల్‌టైం గ్రేట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్ దేవ్, 1982-83 సీజన్‌లో శ్రీలంకపై కెప్టెన్‌గా ఆరంగ్రేటం చేశాడు. అప్పటిదాకా టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహారించిన సునీల్ గవాస్కర్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో కపిల్‌కి కెప్టెన్సీ దక్కింది.

ఆ తర్వాత ఏడాది కపిల్‌దేవ్ కెప్టెన్‌గా భారత జట్టు 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచి.. చరిత్ర క్రియేట్ చేసింది. ఈ వరల్డ్‌కప్‌‌కి ముందు కపిల్‌దేవ్ కేవలం 32 మ్యాచులు ఆడి 608 పరుగులు చేసి, 34 వికెట్లు మాత్రమే తీయడం విశేషం.
క్రికెట్ చరిత్రలో అనితర సాధ్యమైన రికార్డులు క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, 1996లో కెప్టెన్‌గా తన సిరీస్‌లో శ్రీలంకపైనే ఆడాడు.
కెప్టెన్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయినా 73 వన్డేల్లో 23 విజయాలను అందించిన సచిన్ టెండూల్కర్... 25 వన్డేల్లో 4 విజయాలు, 12 డ్రాలు అందించాడు. సచిన్ కెప్టెన్సీలో టీమిండియా 9 టెస్టుల్లో ఓడింది.
భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ ఎంట్రీ ఇచ్చింది, కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలంకపైనే... 2016 వన్డే వరల్డ్‌కప్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత జరిగిన శ్రీలంక సిరీస్‌తో వన్డే కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు.
అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, విదేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న సారథిగానూ నిలిచాడు...
2017లో భారత సారథి విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో శ్రీలంక సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహారించాడు రోహిత్ శర్మ. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ గెలిచింది.
భారత కెప్టెన్‌గా 19 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, అందులో 15 విజయాలు అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో శ్రీలంక, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్ గెలవగా న్యూజిలాండ్ రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.
తాజా పర్యటనతో శిఖర్ ధావన్ కూడా ఈ లెజెండరీ కెప్టెన్ల సరసన చేరనున్నాడు. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా యువ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది.

Latest Videos

click me!