
Kane Williamson: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అతని ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ విక్టరీ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ కీవీస్ స్టార్ మరో ఘనత సాధించాడు.
కేన్ విలియమ్సన్ అజేయంగా 113 బంతుల్లో 133 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. విల్ యంగ్ ఔటైన తర్వాత 50/1తో న్యూజిలాండ్ వుండగా, డెవాన్ కాన్వే (107 బంతుల్లో 97 పరుగులు)తో కలిసి రెండో వికెట్‌కు కీలకమైన 187 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాన్వే ఔటైన తర్వాత న్యూజిలాండ్ స్కోరు 237/1 పరుగులకు చేరింది. గ్లెన్ ఫిలిప్స్ కూడా 32 బంతుల్లో 28 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన కేన్ విలియమ్సన్
133 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ కు విజయాన్ని అందించడంతో పాటు కేన్ విలియమ్సన్ 7000 వన్డే పరుగుల మార్కును దాటాడు. ఈ మైలురాయిని అందుకున్న అత్యంత వేగవంతమైన న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. కేవలం 159 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు.
మార్టిన్ గప్టిల్ (186 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు) మునుపటి రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే, 7000 వన్డే పరుగులను చేరుకోవడంలో రెండో అత్యంత వేగవంతమైన ఆటగాడిగా కేన్ విలియమ్సన్ నిలిచాడు. ఈ విషయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (161 ఇన్నింగ్స్‌లలో 7000 వన్డే పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ ను కూడా దాటేసిన కేన్ విలియమ్సన్
వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేయడంలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలను విలియమ్సన్ అధిగమించాడు. ఈ ఫార్మాట్‌లో 7000 పరుగులు చేరుకోవడానికి అతను 159 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, కోహ్లీ 161, సచిన్ టెండూల్కర్ వరుసగా 189 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా 150 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. విలియమ్సన్ కంటే ముందు, 7000 వన్డే పరుగులు చేసిన వేగవంతమైన న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్, అతను 186 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు అతని రికార్డును కేన్ మామ బద్దలు కొట్టాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 క్రికెటర్లు
1 - హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్‌లు
2 - కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్‌లు
3 - విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్‌లు
4 - ఎబి డివిలియర్స్: 166 ఇన్నింగ్స్‌లు
5 - సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్‌లు
2023లో వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరిగిన సెమీఫైనల్ తర్వాత కేన్ విలియమ్సన్ ట్రైసిరీస్ తో తొలిసారిగా వన్డే క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. పాకిస్తాన్‌తో జరిగిన ట్రై-సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆడాడు. దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ తర్వాత 89 బంతుల్లో 58 పరుగులతో రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ 330/6 పరుగులు చేయడంలో సహాయపడ్డాడు. ఈ తర్వాత కీవీస్ బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్‌ను 252 పరుగులకే పరిమితమైంది.
రెండో మ్యాచ్‌లో విలియమ్సన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదే ఫామ్‌ను కొనసాగించాడు. 34 ఏళ్ల ఈ ఆటగాడు వన్డేల్లో ఐదేళ్ల సెంచరీ కరువును ముగించాడు. ఈ మ్యాచ్‌కు ముందు, కేన్ విలియమ్సన్ చివరిసారిగా 2019 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై సెంచరీ సాధించాడు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సూపర్ ఫామ్ లోకి కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ తన 14వ వన్డే సెంచరీని సాధించి 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. దీంతో న్యూజిలాండ్ ఇప్పుడు మస్తు ఖుషీ అవుతోంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తరపున రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు కేన్ విలియమ్సన్.
ఆరు మ్యాచ్‌లలో 69 సగటుతో శతకం, మూడు అర్ధశతకాలతో సహా 345 పరుగులు చేశాడు. 2010లో అరంగేట్రం చేసినప్పటి నుండి విలియమ్సన్ న్యూజిలాండ్ తరపున వన్డే క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు పాకిస్తాన్‌లో హైబ్రిడ్ మోడల్‌తో జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ సిద్ధమవుతున్నందున అతని ఫామ్ కీలకం. రాబోయే ఐసీసీ టోర్నీలో ఇదే ఫామ్ కొనసాగించాలని కీవీస్ జట్టు ఆశిస్తోంది.
న్యూజిలాండ్ గ్రూప్ Aలో పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్‌లతో కలిసి ఉంది. మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని బ్లాక్ క్యాప్స్ ఫిబ్రవరి 19న కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ విజయయాత్రను ప్రారంభిస్తుంది.