ఇంగ్లాండ్ పతనం మొదలైంది భారత్‌లోనే... చెన్నై టెస్టు తర్వాత కోలుకోలేకపోయిన జో రూట్ టీమ్...

First Published Dec 21, 2021, 3:03 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 సీజన్‌లో భారత్‌తో పాటు పోటీపడింది ఇంగ్లాండ్ జట్టు. పాయింట్ల ఆధారంగా కాకుండా విజయాల శాతం ప్రాతిపదికగా ఫైనల్ ఆడే జట్లను నిర్ణయించాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నా, ఇంగ్లాండ్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ వరస పరాజయాలతో సతమతమవుతోంది...

గత ఏడాది టెస్టుల్లో ఆరు విజయాలు, రెండు డ్రా మ్యాచులు, ఒకే పరాజయం అందుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఈ ఏడాది ఆరంభంలోనూ శ్రీలంక టూర్‌లో రెండు ఘన విజయాలతో భారత్‌లో అడుగుపెట్టింది...

చెన్నైలో జరిగిన మొదటి టెస్టులో భారత జట్టును 227 పరుగుల భారీ తేడాతో ఓడించింది ఇంగ్లాండ్ టీమ్. కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీతో చెలరేగాడు... అయితే ఈ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ టెస్టు పర్ఫామెన్స్ ఘోరంగా దిగజారింది...

చెన్నైలోనే ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో విరాట్ సేన 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్‌ని ఇంగ్లాండ్ 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

భారత్‌పై ఇంగ్లాండ్‌కి ఇదే అత్యల్ప స్కోరు. అక్కడి నుంచి ఇంగ్లాండ్ జట్టు మునుపటి ఫామ్‌ను అందుకోలేకపోతోంది. భారత్‌లో వరుసగా మూడు టెస్టుల్లో ఓడి 3-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండ్...

ఈ ఓటమి కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది ఇంగ్లాండ్. అయితే ఈ ఓటమి తర్వాత యాషెస్ సిరీస్‌కి ముందు స్వదేశంలో జరిగే ఏడు టెస్టులను గెలిచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటామని కామెంట్ చేశాడు జో రూట్...

జో రూట్ ఏ నిమిషాన ఆ కామెంట్లు చేశాడో కానీ అప్పటి నుంచి ఇంగ్లాండ్‌కి ఏదీ కలిసి రావడం లేదు. జూన్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో ఓడింది ఇంగ్లాండ్ జట్టు...

భారత్‌తో జరిగిన మొదటి టెస్టులో వర్షం అంతరాయం కలిగించడంతో ఓటమి నుంచి గట్టెక్కిన ఇంగ్లాండ్, లార్డ్స్ టెస్టులో 151 పరుగుల తేడాతో టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడింది...

హెడ్డింగ్‌లేలో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చినా, ఓవల్‌లో జరిగిన టెస్టులో భారత్ చేతుల్లో 157 పరుగుల తేడాతో ఓడింది ఇంగ్లాండ్... 

యాషెస్ సిరీస్‌కి ఏడు టెస్టులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన జో రూట్... ఐదింట్లో మూడింట్లో ఓడి, రెండు డ్రాలు చేసుకుని, ఓ మ్యాచ్‌లో మాత్రం విజయాన్ని అందుకోగలిగాడు... కరోనా కేసుల కారణంగా ఓ టెస్టు మ్యాచ్ వాయిదా పడింది...

ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్, ఇంతకుముందులా కాకపోయినా కనీస పోరాటప్రటిమ కూడా చూపించకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది...

ఇంగ్లాండ్ ఆటతీరు చూస్తుంటే భారత్‌లో టీమిండియా చేతుల్లో ఓటమి నుంచి ఇంకా తేలుకోన్నట్టే కనిపిస్తోంది. మిగిలిన మూడు టెస్టుల్లో అయినా ఇంగ్లాండ్ పోరాడగలిగితే, మంచి ఇంట్రెస్టింగ్ సిరీస్ చూసే అవకాశం దొరుకుతుంది. లేదా ఆసీస్ వార్ వన్ సైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది...

జో రూట్ ఈ ఏడాది 14 మ్యాచుల్లో 27 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 1630 పరుగులు చేశాడు. ఈ ఏడాది జో రూట్ సగటు 62.69గా ఉంది. అయినా మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం దక్కకపోవడంతో ఇంగ్లాండ్‌కి విజయాలు అందించలేకపోతున్నాడు జో రూట్..

click me!