భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్, సెంచరీ దిశగా జో రూట్... అశ్విన్ లేని లోటు కనిపిస్తుందా కోహ్లీ...

First Published Aug 7, 2021, 7:21 PM IST

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు మంచి పొజిషన్‌ దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన జో రూట్, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ దిశగా సాగుతున్నాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్లు, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోసం కష్టపడుతుండడంతో టీమిండియాలో వికెట్ టేకింగ్ స్పిన్నర్ అశ్విన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.. 

ఓవర్‌నైట్ స్కోరు 25/0 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌కి ఆరంభంలోనే షాక్ తగిలింది... 49 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను సిరాజ్ అవుట్ చేశాడు...

ఆ తర్వాత కొద్దిసేపటికే 7 బంతుల్లో 6 పరుగులు చేసిన జాక్ క్రావ్లీ... బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు...

అయితే డొమినిక్ సిబ్లీ, జో రూట్ కలిసి మూడో వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఓ ఎండ్‌లో జో రూట్ దూకుడుగా ఆడుతూ బౌండరీల మోత మోగిస్తుంటే... మరో ఎండ్‌లో సిబ్లీ జిడ్డాట ఆడాడు...

133 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 135 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

ప్రారంభం నుంచి బౌండరీలు కొట్టడంపైనే ఫోకస్ పెట్టినట్టుగా కనిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... 13 ఫోర్లతో 80+ పరుగులు చేసి, సెంచరీ దిశగా సాగుతున్నాడు...

రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీస్తూ వికెట్ టేకర్‌గా ఉండే రవిచంద్రన్ అశ్విన్‌ లేకుండా బరిలో దిగిన టీమిండియా... భారీ మూల్యం చెల్లించుకునేలా ఉంది. జో రూట్‌ను అత్యధికంగా ఐదు సార్లు అవుట్ చేసిన అశ్విన్, ఈ మ్యాచ్‌లో ఆడకపోవడం ఇంగ్లాండ్‌కి కలిసొచ్చేలా ఉంది...

ఇంగ్లాండ్ కౌంటర్ అటాక్‌ ముందు నిలవలేకపోతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 70+ పరుగుల ఆధిక్యం సాధించింది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉండడంతో 175+ పరుగులు చేసినా... నాలుగో ఇన్నింగ్స్‌లో ఆ టార్గెట్‌ను ఛేదించడం టీమిండియాకి కష్టంగా మారుతుంది...

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ల విజృంభణతో అశ్విన్‌ని పక్కనబెట్టడం కరెక్టేనని భావించిన క్రికెట్ ఫ్యాన్స్‌కి, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పోరాటంతో భారత ప్రధాన స్పిన్నర్‌‌కు తుదిజట్టులో చోటు ఇవ్వకపోవడం ఎంత పెద్ద తప్పిదమో తెలిసివచ్చింది...

click me!