ఆ ముగ్గురితోనే అసలు సమస్య... విరాట్ కోహ్లీ, పూజారా, అజింకా రహానే ఫామ్‌ కారణంగా...

First Published Aug 7, 2021, 3:25 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. టీమిండియాను కొంత కాలంగా వేధిస్తున్న లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్య ఈ మ్యాచ్‌లో ఏ మాత్రం కనిపించలేదు...

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో ఆడిన సిరీస్‌లోనూ టీమిండియా ఈ లోయర్ ఆర్డర్‌లో పరుగుల లేమి సమస్యను ఫేస్ చేసింది. అంతెందుకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్‌లో 50+ పరుగులు వచ్చినా రిజల్ట్ వేరేలా ఉండేది...

తొలి టెస్టులో అసలు బ్యాటింగ్ సరిగా పట్టుకోవడం కూడా రాదని విమర్శలు ఎదుర్కొన్న జస్ప్రిత్ బుమ్రా కూడా బౌండరీలతో దుమ్మురేపాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కూడా ఉన్నంత సేపు ఎంతో కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేశారు...

తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టారు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... తన ఫామ్‌ను అందుకుంటూ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించాడు...ন। 

ఇప్పటిదాకా టీమిండియా ప్రదర్శన అంతా బాగానే ఉంది. అయితే భారత జట్టు అభిమానులను వెంటాడుతున్న అసలు సమస్య టాప్ 3 విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే ఫామ్...

సాధారణంగా అయితే కోహ్లీ, పూజారా, రహానే కారణంగా ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందులు రావాలి. అయితే ఇప్పుడు వీళ్లున్న ఫామ్ కారణంగా భారత జట్టు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది...

లోయర్ ఆర్డర్‌లో 11వ స్థానంలో వచ్చిన మహ్మద్ సిరాజ్ 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిస్తే, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. పూజారా 4, రహానే 5 పరుగులు చేశాడు. అంటే ఈ టాప్ 3 బ్యాట్స్‌మెన్ కలిసి చేసింది 9 పరుగులు...

ఛతేశ్వర్ పూజారా సెంచరీ చేసి రెండేళ్లు దాటింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి 600+ రోజులు దాటింది... మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన అజింకా రహానే, ఆ తర్వాత అలాంటి ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు...

అయితే ఇప్పుడే వీరి ఫామ్‌పై ఓ అంచనాకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌ మాత్రమే ముగిసింది. ఇంకా రెండో ఇన్నింగ్స్‌తో పాటు మరో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది...

అసలే తుది జట్టులో చోటు కోసం మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్, రీసెంట్‌గా వచ్చిన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఎదురుచూస్తున్నారు. ఈ ముగ్గురి పర్ఫామెన్స్ ఇలాగే కొనసాగితే మాత్రం... సంచలన మార్పులు తేవాలని అభిమానులు డిమాండ్ చేయడం ఖాయం...

ఇది భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మరింత బాధించవచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కి ఆధిక్యం దక్కినంత మాత్రాన ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టు ఏ సమయంలో అయినా కమ్‌బ్యాక్ ఇవ్వొచ్చు...

అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సీనియర్లు రాణించడం చాలా అవసరం. లేకపోతే 14 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవాలనే కోహ్లీ కోరిన నెరవేరడం కష్టమే...

click me!