రెండేళ్లు అయిపోయిందా? తెలీనేలేదు... టెస్టు రీఎంట్రీపై కుల్దీప్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్...

First Published Dec 17, 2022, 1:36 PM IST

దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియా తరుపున టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు 150 పరుగులకే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు.. 40 పరుగులకే 5 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు కుల్దీప్..

Kuldeep Yadav

2019 ఆస్ట్రేలియా టూర్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, 2020 ఆసీస్ టూర్‌లో తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా గాయపడినా నాలుగో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ని ఆడించడానికి ఆసక్తి చూపించలేదు టీమిండియా..

బ్రిస్బేన్ టెస్టులో రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చి, బ్యాటుతో హాఫ్ సెంచరీ చేసి మెప్పించాడు. బౌలింగ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఆల్‌రౌండర్ కావడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు కోసం చాలా కాలమే ఎదురుచూడాల్సి వచ్చింది..

kuldeep

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టులలో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కినా... అశ్విన్, అక్షర్ మాయాజాలంతో కుల్దీప్ యాదవ్‌తో ఎక్కువ ఓవర్లు వేయించలేదు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కుల్దీప్ యాదవ్‌కి వరుస అవకాశాలు దక్కుతున్నాయి...

Kuldeep Yadav

‘నేను టెస్టు ఆడి రెండేళ్లు కావస్తుందా... అబ్బా! తెలియనేలేదు. సర్జరీ తర్వాత నేను ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడకుండా కూర్చొని ఉంటే బాధపడుతూ ఉండేవాడిని. కానీ గత ఏడాదిగా నేను వరుసగా సిరీస్‌లు ఆడుతూనే ఉన్నాను. టీమిండియా తరుపున వైట్ బాల్ సిరీస్లు ఆడా. న్యూజిలాండ్ ఏ టీమ్‌తో రెడ్ బాల్ సిరీస్ ఆడాను...

న్యూజిలాండ్ పర్యటనలో (Team India-A తరుపున)  చాలా సుదీర్ఘమైన స్పెల్స్ వేశాను. టీమిండియాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నా. కాబట్టి నాలో ఎలాంటి ఒత్తిడి లేదు. నా బౌలింగ్ యాక్షన్, స్టైల్ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. టెస్టుల్లో బౌలింగ్ చేసేటప్పుడు బంతిపైన మరింత నియంత్రణ కావాలి...

ఈ పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోంది. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇంకా బాగా బ్యాటింగ్ చేయొచ్చు. కొన్ని బంతులు చాలా కిందికి వస్తున్నా, పెద్దగా కష్టంగా అనిపించలేదు. నేను, అశ్విన్ బ్యాటింగ్ చేసేటప్పుడు 360 వస్తే చాలనుకున్నా. 400కి పైగా స్కోరు చేయగలిగాం. రెండో ఇన్నింగ్స్‌లో అయినా స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం వస్తుందేమో చూడాలి..’ అంటూ కామెంట్ చేశాడు కుల్దీప్ యాదవ్...

2021 ఐపీఎల్ రెండో ఫేజ్‌కి ముందు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న కుల్దీప్ యాదవ్, ఐపీఎల్‌లో కేకేఆర్ నుంచి బయటికి వచ్చాడు. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన కుల్దీప్ యాదవ్.. 14 మ్యాచుల్లో 21 వికెట్లు తీసి అదరగొట్టాడు.. 

click me!