ఐపీఎల్ 2023 వేలంలో కేదార్ జాదవ్‌ని పట్టించుకోని ఫ్రాంఛైజీలు... ధోనీ ఆప్తుడికి షార్ట్ లిస్టులో...

First Published Dec 17, 2022, 4:56 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎన్ని విజయాలు అందుకున్నాడో అంతకుమించి విమర్శలు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి ఆప్తులైన వారికే టీమ్‌లో ఎక్కువగా అవకాశాలు ఇస్తాడనే ఆరోపణ కూడా ఒకటి. సురేష్ రైనా, కేదార్ జాదవ్, ఆర్‌పీ సింగ్ వంటి ప్లేయర్లు పెద్దగా రాణించకపోయినా టీమ్‌లో చోటు దక్కించుకున్నాడనే దానికి ధోనీయే కారణం...

టీమిండియా తరుపున 73 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడిన కేదార్ జాదవ్, 2019 వన్డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2014లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కేదార్ జాదవ్, 2020లో న్యూజిలాండ్‌పై ఆఖరి అంతర్జాతీయ వన్డే ఆడాడు...

టీమిండియా తరుపున 73 వన్డేల్లో 42.09 సగటుతో 1389 పరుగులు చేసిన కేదార్ జాదవ్, టీ20ల్లో 20.33 సగటుతో 122 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆల్‌రౌండర్‌గా టీమ్‌లోకి వచ్చిన కేదార్ జాదవ్, బౌలింగ్‌లో 27 వికెట్లు తీశాడు. అయితే ఆడిన 9 టీ20 మ్యాచుల్లో కేదార్ జాదవ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం విశేషం...

2010లో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన కేదార్ జాదవ్, ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 50 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత సీజన్‌లో కొచ్చి టస్కర్స్ కేరళ తరుపున ఆడిన కేదార్ జాదవ్.. 2011 సీజన్‌లో ఆరు మ్యాచులు మాత్రమే ఆడాడు...

2013లో మరోసారి ఢిల్లీకి వెళ్లిన కేదార్ జాదవ్, 2016-17 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మారిన కేదార్ జాదవ్, 2020 వరకూ ఆ జట్టులోనే ఉన్నాడు. 2020 సీజన్‌లో సీఎస్‌కే వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది...

2018 వేలంలో కేదార్ జాదవ్‌ని రూ.7 కోట్ల 80 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. కుర్రాళ్లను పక్కనబెట్టి వరుసగా విఫలమవుతున్న జాదవ్‌ని కొనసాగించడంపై ధోనీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో 2021 మినీ వేలంలో జాదవ్‌ని విడుదల చేసింది సీఎస్‌కే...

తొలి రౌండ్‌లో అమ్ముడుపోని కేదార్ జాదవ్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే 6 మ్యాచుల్లో కలిపి 55 పరుగులే చేసిన కేదార్ జాదవ్, రిటెన్షన్ దక్కించుకోలేకపోయాడు. 2022 మెగా వేలంలో కేదార్ జాదవ్ కూడా అమ్ముడుపోలేదు...

ఐపీఎల్‌లో 93 మ్యాచులు ఆడి 22.14 సగటుతో 1196 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌కి, 2023 మినీ వేలంలో చోటు దక్కకపోవడం విశేషం. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేదార్ జాదవ్, టీమిండియాకి టీ20ల్లో కానీ, ఐపీఎల్‌ల్లో కానీ ఒక్క ఓవర్ కూడా ఎందుకు బౌలింగ్ చేయలేదనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.. 

Kedar Jadhav

37 ఏళ్ల కేదార్ జాదవ్‌కి ఐపీఎల్ 2023 మినీ వేలం షార్ట్ లిస్టులో చోటు దక్కకపోవడంతో అతని కెరీర్ దాదాపు ముగిసినట్టే... కేదార్ జాదవ్‌తో పాటు భారత టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా కూడా ఐపీఎల్ 2023 మినీ వేలం షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు... 

click me!