ఫారెన్ లీగ్స్‌లో మనోళ్లను ఆడిస్తే ఫలితాలు మరో విధంగా ఉండేవేమో..! కొత్త చర్చకు తెరతీసిన ద్రావిడ్

First Published | Nov 11, 2022, 11:46 AM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో సెమీస్ లో ఓడటంతో టీమిండియా స్వదేశానికి పయనమైంది. అయితే మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఓడిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ఆసక్తికర చర్చకు తెరలేపాడు.  భారత క్రికెటర్లను ఫారెన్ లీగ్స్ లో అనుమతించే ప్రసక్తే లేదని గిరిగీసుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  పెట్టుకున్న నియమ నిబంధనలకు వ్యతిరేకంగా  వ్యాఖ్యలు చేశాడు.   ఈ వ్యాఖ్యలతో రాహుల్ ద్రావిడ్ సరికొత్త చర్చకు తెరదీశాడు. 

సాధారణంగా ఐపీఎల్ లో వివిధ దేశాల నుంచి క్రికెటర్లను ఆడించే అలవాటున్న టీమిండియా.. ఇతర దేశాలలో  జరిగే  లీగ్స్ లో మాత్రం భారత ఆటగాళ్లను ఆడించదు. ఇదే విషయమై ఇటీవలే ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కూడా  బీసీసీఐ  పాత నిర్ణయానికే కట్టుబడి ఉందని.. క్రికెటర్ల శ్రేయస్సు దృష్ట్యా  ప్రస్తుతానికైతే తాము ఇదే పద్ధతిని అవలంభిస్తామని  తెలిపాడు. 


కానీ ఇంగ్లాండ్ తో సెమీస్ ఓటమి తర్వాత ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘చాలా మంది ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో ఆడిన అనుభవముంది. ఇండియాతో సెమీస్ తో పాటు ఈ టోర్నీలో కూడా వాళ్ల ఆటను చూస్తే దానిని గమనించవచ్చు. నా అభిప్రాయం ప్రకారం భారత ఆటగాళ్లు అదే మిస్ అయ్యారని అనిపిస్తుంది.  

ఫారెన్ లీగ్స్ లో ఆడకపోవడం మమ్మల్ని దెబ్బతీసింది. అయితే  దీనిపై బీసీసీఐ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి.  ఈ లీగ్స్ భారత క్రికెట్ సీజన్ పీక్స్ లో ఉన్నప్పుడు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మాకు  కఠినమైన సవాల్ తో కూడుకున్నదే...’ అని తెలిపాడు. 

బీసీసీఐ నిబంధనల ప్రకారం  బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న క్రికెటర్లెవరూ ఫారెన్ లీగ్స్ లో ఆడటానికి వీళ్లేదు. ఒకవేళ అలా ఆడాల్సి వస్తే ఇకపై జాతీయ జట్టుకు గానీ దేశవాళీలో గానీ ఆడబోమని  బీసీసీఐ షరతులకు తలొగ్గి ఆడాలి.   ఈ విషయంలో బీసీసీఐ పై విమర్శలు వెల్లువెత్తుతున్నా బోర్డు మాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నది. 

అయితే ఇలా చేస్తే అది భారత క్రికెట్ కే ప్రమాదమన్నవారూ లేకపోలేదు. విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ఫారెన్ లీగ్స్  లో  ఆడేందుకు భారత క్రికెటర్లను అనుమతిస్తే అప్పుడు మన దేశవాళీ (రంజీ, ఇతర టోర్నీలు) కథ ముగిసినట్టేనని వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ద్రావిడ్   కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేశాడు. 

ద్రావిడ్ తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ.. ‘భారత క్రికెటర్లను ఈ లీగ్స్ లోకి అనుమతిస్తే  మనకు దేశవాళీ ఉండదు.  రంజీలు, ఇతర టోర్నీల కథ ముగుస్తుంది. జాతీయ జట్టుకు రావడానికి కీలకంగా వ్యవహరించే దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆగమవుతుంది.  తమ ఆటగాళ్లను ఫారెన్ లీగ్స్ లో అనుమతిస్తే వెస్టిండీస్ క్రికెట్ ఎలా అయిందో చూశాం..’ అని పూర్తి చేశాడు. 
 

Latest Videos

click me!