Virat Kohli: ఇలాంటి మ్యాచ్‌లో తప్పులు సహజం.. నేనూ బాధితుడినే.. అర్ష్‌దీప్‌కు కోహ్లీ మద్దతు

First Published Sep 5, 2022, 11:51 AM IST

Arshdeep Singh: పాకిస్తాన్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో  భారత్ ఓటమికి  అందరూ  టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ను నిందిస్తున్నారు. అతడు క్యాచ్ మిస్  చేయడం వల్లే.. 
 

కెరీర్ ఆరంభంలో ఉన్న టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. ఆదివారం ముగిసిన  భారత్-పాక్ మ్యాచ్ లో చివర్లో కీలకమైన క్యాచ్ మిస్ చేయడం వల్లే ఈ మ్యాచ్ టీమిండియా చేజారిందని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా  క్రికెట్ అభిమానులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Arshdeep Singh

అయితే  జట్టు నుంచి అతడికి మద్దతు లభిస్తున్నది.  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ కు మద్దతుగా నిలిచాడు. ఇటువంటి హై ఓల్టేజీ మ్యాచ్ లలో  తప్పులు చేయడం సహజమని,  కెరీర్  ప్రారంభంలో తాను కూడా ఇలాంటి తప్పులు చేశానని చెప్పుకొచ్చాడు. 

మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఎవరైనా తప్పులు చేస్తారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంటుంది. అటువంటి మ్యాచ్ లలో ఇలాంటి తప్పులు జరుగుతాయి. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. 

నేను నా కెరీర్ ఆరంభంలో  మొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు  కూడా ఓ తప్పు చేశాను. షాహిద్ అఫ్రిది వేసిన  ఓ బంతికి చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాను.  దాంతో నేను చాలా నిరాశకు గురయ్యాను.

ఆరోజు నేను తెల్లవారుజామున 5 గంటల వరకు రూమ్ లో నిరాశగా సీలింగ్ ఫ్యాన్ చూస్తూనే ఉన్నాను.  అసలు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు.  ఆ సమయంలో నేను నా కెరీర్ ముగిసిందని అనుకున్నాను.  కానీ ఇవన్నీ సర్వ సాధారణం..’అని చెప్పాడు. 

అర్ష్‌దీప్ కు మద్దతుగా నిలుస్తూ.. ‘సీనియర్ ప్లేయర్లు నీకు అండగా ఉన్నారు. జట్టులో మంచి వాతావరణం ఉంది. దీనికి కెప్టెన్, హెడ్ కోచ్ ను అభినందించాలి. ఆటగాళ్లు తప్పుల నుంచి నేర్చుకుంటారు.అయితే తప్పులను ఒప్పుకుని వాటి నుంచి గుణపాఠం నేర్చుకుని మళ్లీ అవి జరగకుండా చూసుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవడమెలాగో నేర్చుకోవాలి..’ అని  సూచించాడు. 

అర్ష్‌దీప్ కు కోహ్లీ తో పాటు టీమిండియా మాజీ బౌలర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా మద్దతుగా నిలిచారు.  అర్ష్‌దీప్ పై ట్రోల్స్ చేస్తున్నవారికి భజ్జీ కౌంటరిచ్చాడు. ట్విటర్ వేదికగా అతడు స్పందిస్తూ.. ‘అర్ష్‌దీప్ ను ట్రోల్ చేయడం ఆపండి. కావాలని ఎవరూ క్యాచ్ లను మిస్ చేయరు. మన ఆటగాళ్లను చూసి గర్వపడాలి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మనకంటే కాస్త మెరుగ్గా ఆడింది. అర్ష్‌దీప్ పై ట్రోల్స్ చేస్తున్నవారిని చూస్తే సిగ్గుగా ఉంది. అతడు బంగారం..’ అని ట్వీట్ చేశాడు.

click me!