అతడి వల్లే కోహ్లికి ఈ గతి పట్టింది.. లేకుంటే సెంచరీల వరద పారించేవాడు : పాక్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

First Published Jun 23, 2022, 2:39 PM IST

Virat Kohli: టీమిండియా మాజీ సారథి అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీ చేయక దాదాపు మూడేండ్లు కావొస్తున్నది.  అయితే అతడు  ఈ దుస్థితిని ఎదుర్కోవడానికి టీమిండియా మాజీ హెడ్ కోచ్... 

ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లి గత మూడేండ్లుగా అసలు ఆడటమే మరిచిపోయాడా..? అన్న చందంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్ లో అతడు సెంచరీ చేయక సుమారు మూడేండ్లు కావొస్తున్నది. 

టెస్టు, వన్డేలు, టీ20లతో పాటు ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 లో కూడా విరాట్ కోహ్లి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో కోహ్లి ఏకంగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఒకప్పుడు టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఈ రన్ మిషీన్.. ఇప్పుడు క్రీజులో నిలదొక్కుకునేందుకే తంటాలు పడుతున్నాడు. 

అయితే కోహ్లి ఫామ్ కోల్పోయి ఇలా తంటాలు పడటానికి కారణం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రే అంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. కోచింగ్ లో ఓనమాలు తెలియని శాస్త్రిని హెడ్ కోచ్ గా నియమిస్తే ఇలాగే ఉంటుందని.. కుంబ్లేని తీసేసి శాస్త్రిని నియమించుకున్న తర్వాతే కోహ్లి ఆటలో నాణ్యత తగ్గిందని వాపోయాడు. 

తన యూట్యూబ్ ఛానెల్ లో లతీఫ్ మాట్లాడుతూ.. ‘కోహ్లి ఫామ్  కోల్పోవడానికి కారణం అతడే (రవిశాస్త్రి). 2019 లో కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాడిని పక్కకునెట్టి రవిశాస్త్రిని తీసుకొచ్చి హెడ్ కోచ్ గా నియమించారు. అసలు అతడికి కోచింగ్ లో ఓనమాలు తెలుసో లేదో నాకైతే తెలియదు..

శాస్త్రి ఒక బ్రాడ్కస్టర్ (మ్యాచ్ జరుగుతున్నప్పుడు  దాని గురించి ప్రేక్షకులకు విశ్లేషించేవాడు) మాత్రమే. అతడికి కోచింగ్ తో సంబంధం లేదు. అతడికి ఈ బాధ్యతలు అప్పగించడానికి తెరవెనుక మంతనాలు ఏం జరిగాయో ఇప్పుడు అనవసరం. కానీ దీనివల్ల ఎదురుదెబ్బ తగిలింది కోహ్లికి. 

రవిశాస్త్రి గనక టీమిండియాా హెడ్ కోచ్ కాకుండా ఉండుంటే కోహ్లి తన ఫామ్ ను కోల్పోయేవాడు కాదు. అతడు గతంలో మాదిరే  పరుగుల వరద పారించేవాడు..’ అని వ్యాఖ్యానించాడు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తో రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు వదిలి రాహుల్ ద్రావిడ్ కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ లు మారినా కోహ్లి ఫామ్ మాత్రం మారడం లేదు. 

click me!