మిగతా రెండు మ్యాచ్‌లలో బుమ్రా ఆడినా టీమిండియా ఓడిపోదని గ్యారెంటీ ఉందా..? : ఆర్పీ సింగ్

First Published Sep 22, 2022, 4:49 PM IST

IND vs AUS T20I: ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా ముగిసిన మ్యాచ్ ఓడటం వల్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉందో తెలియదు గానీ  జట్టు పేలవ బౌలింగ్ పై విమర్శల వర్షం కురుస్తున్నది. 
 

మొహాలీ టీ20లో భారత జట్టు ఓటమిపై ముప్పేట దాడి పెరుగుతున్నది. జట్టు కూర్పు, పేలవ బౌలింగ్ పై సీనియర్ ఆటగాళ్లు, విమర్శకులు టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  ఇప్పటికైనా మేల్కోకుంటే   నెల రోజుల్లో ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్  లో తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

ఆసీస్ తో తొలి టీ20లో ఓటమికి ప్రధానకారణమైన బౌలింగ్ వైఫల్యం గురించి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో బుమ్రాను తీసుకుంటే బాగుండేదని కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ బుమ్రా వచ్చినా పెద్దగా మార్పేమీ ఉండదని అంటున్నాడు భారత జట్టు మాజీ పేసర్ ఆర్పీ సింగ్..

తాజాగా అతడు క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ కు ముందు భారత జట్టు ఆసియా కప్ లో ఓడిపోవడం, స్వదేశంలో ఆసీస్ చేతిలో తొలి టీ20 కోల్పోవడం మంచి సూచికలు కాదు. ఆసియా కప్ లో హర్షల్ పటేల్, బుమ్రా లేకపోవడంతో బౌలింగ్ దళం వీక్ గా ఉందని కారణం చెప్పారు. మరి ఆసీస్ తో మ్యాచ్ లో హర్షల్ ఆడాడు కదా. 

ఒకవేళ బుమ్రా రాబోయే రెండు టీ20లు ఆడినా అతడు మ్యాచ్ లను కాపాడగలడని గ్యారెంటీ లేదు. అసలు విషయమేంటంటే మనం స్టార్ ప్లేయర్ల మీద బాగా అలవాటు పడుతున్నాం. గాయాలపాలైన ఆటగాళ్లు వచ్చి  మ్యాచ్ లను గెలిపిస్తారని భావిస్తున్నాం. ముందు ఆ ఫోబియా నుంచి బయటపడాలి. 
 

ఆసీస్ పరుగుల వేట సాగిస్తున్న సమయంలో భారత్ ఆధిపత్యం చెలాయించిన సందర్భాలు చాలా అరుదు.  ఆసీస్ నిర్ణీత వ్యవధిలో బౌండరీలు బాదుతూనే ఉంటుంది. వాటితో పాటే సింగిల్స్ కూడా నిలకడగా తీస్తూనే ఉంటుంది. 

మొన్నటి మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ వేసిన ఒక ఓవర్లో రెండు వికెట్లు తీయడం మినహాయించి మిగతా ఓవర్ల (పేసర్లు వేసినవి) లో బంతి బౌండరీ వెళ్లని ఓవర్ లేదు.  ఇది స్కిల్ కు సంబంధించిన విషయం కాదు. బహుశా టీమిండియా ఫీల్డ్ లో వాళ్ల ప్రణాళికలను సరిగా అమలుచేయలేదు అనిపిస్తున్నది..’ అని ఆర్పీ సింగ్ తెలిపాడు. 

click me!