ఆసియా కప్ తర్వాతే అర్థమైపోయింది.. ఆ ఓటమితో పోల్చితే ఇదో లెక్క..? టీమిండియాపై మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్

First Published Sep 22, 2022, 4:00 PM IST

IND vs AUS T20I: ఇటీవలే  యూఏఈ వేదికగా ముగిసిన  ఆసియా కప్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది.  

ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలో దుమ్మురేపిన టీమిండియా ఆసియా కప్ నుంచి గాడి తప్పుతున్నది.  ఆ టోర్నీలో టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన భారత జట్టు.. గ్రూప్ దశలో ఆకట్టుకున్నా సూపర్-4 లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి ఇంటిముఖం పట్టింది. 

ఆసియా కప్ ముగిశాక స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదలైన టీ20 సిరీస్ లో భాగంగా మొహాలీలో ముగిసిన తొలి మ్యాచ్ లో  ఓడింది.  తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. 208 పరుగుల భారీ స్కోరు చేసినా గెలవలేకపోయింది. 
 

టీమిండియా వరుస ఓటములపై  భారత జట్టు మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ఓటమితో పోల్చితే ఆసీస్ తో  పరాజయం  తనను పెద్దగా బాధించలేదని.. తాను పూర్తిగా నిరాశవాదంలో కూరుకుపోయానని చెప్పాడు. 

ఆసీస్ తో మ్యాచ్ తర్వాత మంజ్రేకర్ ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ లో టీమిండియా ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఒక దశలో నేను పూర్తి నిరాశవాదానికి వెళ్లిపోయా. అప్పుడు తాకినవి మాములు గాయాలు కాదు.  ఆ టోర్నీలో భారత్ టైటిల్ కొడుతుందనుకున్నా అది జరగలేదు. అది నన్ను చాలా బాధించింది. 

దానితో పోలిస్తే ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో ఓటమి పెద్దగా బాధ అనిపించలేదు.  వాస్తవానికి చెప్పాలంటే ఈ మ్యాచ్ ద్వారా చాలా పాజిటివ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. బౌలింగ్ వైఫల్యం  పెద్ద విషయమేమీ కాదు. బుమ్రా, షమీ జట్టులోకి వచ్చాక అవి తీరిపోతాయి..’అని  ధీమా వ్యక్తం చేశాడు. 
 

ఇక ఆసీస్ తో మ్యాచ్ లో సీనియర్ పేసర్  భువనేశ్వర్ కుమార్ తో పాటు మీడియం పేసర్ హర్షల్ పటేల్ విఫలమవడంపైనా మంజ్రేకర్ స్పందించాడు. ‘హర్షల్ పటేల్ లో డ్రై పిచ్ ల మీద స్లో డెలివరీలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడతాడు. ఐపీఎల్ లో అతడు అటువంటి ప్రదర్శనలు చాలా చేశాడు.  

అయితే పిచ్ ఫ్లాట్ గా ఉంది పేస్ కు అనుకూలిస్తే హర్షల్ కొంత ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే అక్కడ స్లో బంతులు  విసురుతూ వికెట్లు తీయడం అంత  వర్కవుట్ అవ్వదు. కానీ ఆస్ట్రేలియాలో పిచ్ లు ఫ్లాట్, పేస్ కు అనుకూలించేవే. ఈ విషయంలో టీమిండియా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హర్షల్ ను  వాడుకోవాలి..’ అని  మంజ్రేకర్ చెప్పాడు. 

click me!