ధోనీ కోసం బీసీసీఐ ఐపీఎల్ నిబంధనలను మారుస్తుందా? ఎందుకు?

First Published | Aug 18, 2024, 11:52 PM IST

IPL 2025 - MS Dhoni : క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కోసం బీసీసీఐ కొత్త ఐపీఎల్ నిబంధనలను అమలు చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిజంగానే బీసీసీఐ ఐపీఎల్ లో మార్పులు చేయ‌డానికి సిద్ధంగా ఉందా? దీనికి సంబంధించిన నివేదిక వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 
 

IPL 2025 - MS Dhoni : ఐపీఎల్ 2025 కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 18వ ఎడిషన్ టోర్నీలో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ప్లేయ‌ర్ గా ఉంటాడా? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. అదే సమయంలో ఎంఎస్ ధోనిని రంగంలోకి దింపేందుకు బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనలను మళ్లీ సవరించబోతున్నారనే వార్త‌లు కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపాయి. 

వచ్చే 18వ సీజ‌న్ ఐపీఎల్ టూర్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. మెగా వేలం ఫ్రాంచైజీలు తమకు కావలసిన ఆటగాళ్లను నిర్ణీత సంఖ్యలో ఉంచుకోవడానికి కూడా అనుమతిస్తుంది. రాబోయే మెగా వేలానికి ముందు ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతిస్తారో బీసీసీఐ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇదిలావుండగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కొనసాగించేందుకు గతంలోని నిబంధనలను మళ్లీ అమలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. 

Latest Videos


అంతకుముందు 5 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కేటగిరీ కింద చేర్చాలనే నియమం ఉంది. ఇది ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ నుండి 2021 ఐపీఎల్ టోర్నమెంట్ వరకు అమలులో ఉంది. అయితే అప్పటి వరకు ఏ ఫ్రాంచైజీలు ఈ నిబంధనలను ఉపయోగించకపోవడంతో బీసీసీఐ ఈ నిబంధనలను తొలగించింది. అయితే జూలై 31న బీసీసీఐ, ఫ్రాంచైజీల మధ్య జరిగిన చర్చల సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ పాత నిబంధనలను మళ్లీ అమలు చేయాలని కోరినట్లు ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొన్నాయి. 

కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అభ్యర్థనకు కూడా ఫ్రాంచైజీలు సరైన సహకారం అందించలేదని సమాచారం. అయినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 5 సంవత్సరాల తర్వాత ఆ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల జాబితాలో చేర్చడానికి  బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ధోనీ ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత ఐపీఎల్ టోర్నీకి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ధోనీని రూ.12 కోట్లతో ద‌క్కించుకుంది. టోర్నీ ప్రారంభానికి ముందే ధోనీ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవ‌డంతో ఐపీఎల్ 2024 సీజ‌న్ లో చెన్నై జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయితే చెన్నైకి ఏం లాభం? ఇది మీకు ఆస‌క్తిగా అనిపించ‌వ‌చ్చు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెటర్లను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంటే, వారు గరిష్టంగా 16 కోట్లు, కనిష్టంగా 8 కోట్లు చెల్లించాలి. అంటే రూ.4 కోట్ల తక్కువకు అన్ క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడు)ని అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా, ధోనీ బ్రాండ్ విలువను, అలాగే వేలం కోసం తనపర్స్ ను మెరుగ్గా ఉంచాలని చెన్నై ఫ్రాంచైజీ యోచిస్తోంది. మరి చెన్నై ఫ్రాంచైజీ అభ్యర్థనను బీసీసీఐ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి.

click me!