Jofra Archer. (Photo- England Cricket)
PBKS vs RR IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 18వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు పంజాబ్ ముందు 206 పరుగులు టార్గెట్ ను ఉంచింది. 20 ఓవర్లలో ఆర్ఆర్ 205/4 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ పై అద్భుతమైన బౌలింగ్ తో జోఫ్రా అర్చర్ విధ్వంసం రేపాడు. విధ్వంసం కంటే ఆర్చర్ టార్చర్ పెట్టాడు అంటే బావుంటుందేమో.. అలాంటి బౌలింగ్ వేశాడు. తన తొలి ఓవర్ లోనే పంజాబ్ టీమ్ బిగ్ వికెట్లు పడగొట్టాడు. ఆర్ఆర్ కు మంచి శుభారంభం అందించాడు.
Jofra Archer (PhotoRajasthan Royals Twitter)
206 పరుగులు భారీ టార్గెట్ ను ఛేదించడానికి పంజాబ్ తరఫున ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్ క్రీజులోకి వచ్చారు. గత మ్యాచ్ ఫామ్ ను కొనసాగిస్తూ జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్ వేస్తూ మొదటి బంతికే ప్రియాంశ్ ఆర్యను బౌల్డ్ చేశాడు. అతను అవుట్ అయిన తర్వాత క్రీజులోకి పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు.
మంచి ఫామ్ లో ఉన్న అయ్యర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ను దూకుడుగా ఎదుర్కొన్నాడు. ఆడిన తొలి బంతినే ఫోర్ కొట్టాడు. మూడో బంతికి పరుగులు రాలేదు. 4వ బంతిని మరో బౌండరీగా మలిచాడు శ్రేయాస్ అయ్యర్. జోరుమీదున్న అయ్యర్ ను బోల్తా కొట్టించడానికి ముందు 5వ బంతిని వైడ్ గా వేశాడు. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆ ఓవర్ చివరి బంతికి మరో అద్భుతమైన డెలివరీ వేసి శ్రేయాస్ అయ్యర్ ను బౌల్డ్ చేసి పంజాబ్ కు బిగ్ షాక్ ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్.
Shreyas Iyer. (Photo- BCCIIPL)
దీంతో జోఫ్రా ఆర్చర్ తన తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో ఆర్చర్ డ్రెస్సింగ్ రూమ్ లో దుప్పటి కప్పుకుని హాయిగా నిద్రపోయాడు. బౌలింగ్ సమయంలో గ్రౌండ్ లోకి అడుగుపెట్టి తొలి ఓవర్ లోనే పంజాబ్ కు చెమటలు పట్టించాడు.
ఐపీఎల్ 2025 ప్రారంభ రెండు మ్యాచ్ లలో ఆర్చర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా చెత్త రికార్డును తనపేరు మీద రాసుకున్నాడు. కానీ, చెన్నై సూపర్ కింగ్ తో జరిగిన మూడో మ్యాచ్ లో సూపర్ బౌలింగ్ తో 3 ఓవర్లలో 13 పరుగుల ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అలాగే, ఐపీఎల్ 2025లో తొలి మెయిడెన్ ఓవర్ ను కూడా వేశాడు.
జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ రికార్డులు
జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. మొత్తం 44 మ్యాచ్ లు ఆడి 51 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ రికార్డులు 3/15 వికెట్లు. అలాగే, 216 ఐపీఎల్ పరుగులు చేశాడు. ఐపీఎల్ 2020లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును కూడా ఆర్చర్ గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్లు జోఫ్రా ఆర్చర్ ను రూ. 12.50 కోట్లకు టీమ్ లోకి తీసుకుంది.