CSK vs DC IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఆటతో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తమ సొంత గ్రౌండ్ లోనే ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ను 25 పరుగుల తేడాతో ఓడించింది.
ఐపీఎల్ 2025 17వ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 184 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
ఢిల్లీ తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతో సూపర్ నాక్ ఆడాడు. ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 77 పరుగుల తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా అభిషేక్ పోరెల్ 33 పరుగులు, అక్షర్ పటేల్ 21 పరుగులు, సమీర్ రిజ్వీ 20 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 24 పరుగుల ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
చెన్నై బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్ మరోసారి సూపర్ బౌలింగ్ తో 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఐపీఎల్ 2025లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా టాప్ లో ఉన్నాడు. జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా ఒక వికెట్ పడగొట్టారు.
184 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. ఎక్కడా కూడా మ్యాచ్ ను గెలుచుకునే విధమైన మూమెంట్ రాలేదు. చెన్నై సొంత గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆ టీమ్ బ్యాటర్లు రాణించకపోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
లక్ష్యాన్ని ఛేదించే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర 3 పరుగులు, కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ 5 పరుగులు, డెవాన్ కాన్వే 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
ఆ తర్వాత చెన్నై 10, 11వ ఓవర్లలో మరో రెండు బిగ్ వికెట్లను కోల్పోయింది. శివం దూబే 18 పరుగులు, రవీంద్ర జడేజా కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 74 పరుగులకే చెన్నై టీమ్ సగం వికెట్లను కోల్పోయింది. కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోని, విజయ్ శంకర్ లు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన బౌలింగ్ తో పరుగులు రాకుండా అడ్డుకుంది. చెన్నై ఇన్నింగ్స్ స్లో కావడంతో కావాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. ఇద్దరి మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉన్నప్పటికీ చెన్నై విజయాన్ని అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది.
DC vs CSK
చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ధోని 30 పరుగులు, విజయ్ శంకర్ 69 పరుగులతో అజేయంగా నిలిచారు.
గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో దిగజారింది. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోవడంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 4 మ్యాచ్ లలో ఒకటి గెలిచి 2 పాయింట్లతో 8వ స్థానంలోకి పడిపోయింది. వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఢిల్లీ టీమ్ 6 పాయింట్లతో టాప్ లో ఉంది. రెండు, మూడు స్థానాల్లో పంజాబ్, బెంగళూరు టీమ్ లు ఉన్నాయి.