IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లు తలపడ్డాయి.
ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో ఆర్సీబీ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసి విజయం సాధించింది.
ఆర్సీబీ తరఫున సీనియర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 36 బంతుల్లో అజేయంగా 59 పరుగులతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 5 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతను 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఫిలిప్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 34 పరుగులు సాధించారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పాడికల్ 10 బంతుల్లో 10 పరుగులు చేశాడు. కేకేఆర్ తరఫున వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, కేకేఆర్ తరఫున కెప్టెన్ రహానే 56 పరుగులు, సునీల్ నరైన్ 44 పరుగులు, అంగ్క్రిష్ రఘువంశీ 30 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. కృనాల్ పాండ్యా 3 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. KKR తన తర్వాతి మ్యాచ్ ను మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఆర్సీబీ తన రెండో మ్యాచ్ మార్చి 28న చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడుతుంది.