IPL DC vs MI : Hat-trick runout.. Karn Sharma hits Delhi.. Mumbai Indians win at Capitals Adda
DC vs MI: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ముంబైకి లక్ కలిసివచ్చింది. దాదాపు ఓడిపోయేలా కనిపించిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో ముంబై విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ అనవసరంగా రన్ కోసం పరుగెత్తి హ్యాట్రిక్ రనౌట్‌లతో మ్యాచ్‌ను కోల్పోయారు. ముంబై జట్టు ఢిల్లీని ఒక ఓవర్ ముందుగానే ఆలౌట్ చేసి 12 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.
దీంతో ఐపీఎల్ 2025లో అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఢిల్లీ జట్టు విజయాల ఊపు మీద ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీ జట్టు విజయానికి దగ్గరగా వచ్చింది కానీ, 19వ ఓవర్ లో హ్యాట్రిక్ రనౌట్లతో మ్యాచ్ ను కోల్పోయింది. ఆరంభంలో అదరిపోయేలా దంచికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి 64 పరుగుల సమయంలో 9 వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు తమ సొంత మైదానంలో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై టాప్ ఆర్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ర్యాన్ రికెల్టన్ 41, సూర్యకుమార్ యాదవ్ 40, తిలక్ వర్మ 59 పరుగులు చేయగా, నమన్ ధీర్ కూడా 38 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరి మంచి ఇన్నింగ్స్‌లతో ముంబై టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
Image Credit: TwitterMumbai Indians
206 పరుగుల బిగ్ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫస్ట్ బాల్ కే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ మెగ్ తొలి బంతికి బౌల్డ్ అయ్యాడు. కానీ, రెండవ వికెట్ 119 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం లభించింది. చాలా కాలం తర్వాత ఐపీఎల్ ఆడుతున్న కరుణ్ నాయర్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ముంబై బౌలింగ్ ను దంచికొట్టాడు.
40 బంతుల్లో 89 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఎప్పుడైతే అతను అవుట్ అయ్యాడో.. ఆ తర్వాత ఢిల్లి వికెట్లు కోల్పోతూనే ఉంది. 9 బంతుల్లో 15 పరుగులు అవసరమైనప్పుడు, హ్యాట్రిక్ రనౌట్లతో ఆలౌట్ అయి మ్యాచ్ ను కోల్పోయింది. 18వ ఓవర్ నాలుగో బంతికి అశుతోష్ శర్మ ఔటయ్యాడు, ఆ తర్వాత కుల్దీప్, మోహిత్ శర్మ కూడా రనౌట్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులు చేసి అన్ని వికెట్లు కోల్పోయింది. దీంతో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కీలక సమయంలో 3 వికెట్లు తీసుకుని కర్ణ్ శర్మ ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 7వ స్థానంలోకి చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది.