Kohli completes 100 half-centuries in T20s
Kohli completes 100 half-centuries in T20s: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన నాక్ తో అదరగొట్టాడు. ఆర్ఆర్ బౌలింగ్ ను ఊతికిపారేస్తూ ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు. తన అద్భుతమైన కెరీర్‌లో మరో రికార్డును అందుకున్నాడు. టీ20 క్రికెట్ లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి ఏసియా ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు.
Phil Salt and Virat Kohli
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 39 బంతుల్లోనే వానిందు హసరంగా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఈ సీజన్‌లో తన మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ తుఫాను ఇన్నింగ్స్ తో 17.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 175/1 పరుగులతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 58వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డును కూాడా సమం చేశాడు. అలాగే, టీ20 క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్ గా కూడా వార్నర్ తర్వాత కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే, క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరాన్ పొలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన 5వ ప్లేయర్ గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో 258 మ్యాచ్ లు ఆడి 132 స్ట్రైక్ రేటుతో 8252 పరుగులు కొట్టాడు. ఇందులో 58 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి.
కింగ్ కోహ్లీ భారత్ తరపున 125 టీ20లు ఆడి 4188 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత కోహ్లీ తన టీ20 క్రికెట్ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగుల నాక్ తో కింగ్ కోహ్లీ భారత్ ట్రోఫీని గెలుచుకోవడంతో కీలకంగా ఉన్నాడు.