IPL AUCTION: 2022 ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే... అహ్మదాబాద్, లక్నో నగరాల పేర్లతో...

First Published Oct 25, 2021, 7:22 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదనంగా చేరబోయే రెండు కొత్త జట్ల కోసం వేలం ఉత్కంఠభరితంగా సాగింది. రెండు కొత్త జట్ల కోసం దాదాపు 10 బడా కంపెనీలు, బిడ్స్ దాఖలు చేయగా అహ్మదాబాద్, లక్కో నగరాల పేరు మీద కొత్త జట్లు రాబోతున్నాయి... 

IPL NEW TEAM 2022:  కేవలం బిడ్డింగ్ సమర్పించేందుకే రూ.75 కోట్లు అప్లికేషన్స్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. కేవలం నామినేషన్ల ద్వారానే బీసీసీఐకి రూ.750 కోట్ల ఆదాయం సమకూరినట్టైంది...

అదానీ గ్రూప్‌తో పాటు ఆర్‌పీ సంజీవ్ గోయింకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, ఉదయ్ కోటక్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, అరబిందో‌లతో పాటు దిగ్గజ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌ కూడా ఐపీఎల్‌లో కొత్త జట్టును కొనుగోలు చేసేందుకు అత్యధిక బిడ్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు...

Latest Videos


గోయింకా గ్రూప్ కొత్త జట్టు కోసం రూ.7090 కోట్ల బిడ్ దాఖలు చేసింది. గతంలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌‌ను సొంతం చేసుకున్న ఆర్‌పీ సంజీవ్ గోయింకా, ఈసారి లక్నో టీమ్‌ను సొంతం చేసుకున్నారు.

సీవీసీ క్యాపిటల్ సంస్థ కొత్త జట్టు కోసం రూ.5166 కోట్ల బిడ్ దాఖలు చేసింది. సీవీసీ క్యాపిటల్స్ సంస్థ అహ్మదాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరించనుంది. కేవలం రెండు కొత్త జట్ల ద్వారానే బీసీసీఐకి రూ.12,256 కోట్ల ఆదాయం సమకూరనుంది.

అహ్మదాబాద్‌లోని మొతేరా (నరేంద్ర మోదీ స్టేడియం) కెపాసిటీ దాదాపు లక్షా 12 వేలకు పైగా ఉంది. అహ్మదాబాద్ జట్టు, సొంత గ్రౌండ్‌గా మొతేరా స్టేడియంలో మ్యాచులు జరగనున్నాయి...

అహ్మదాబాద్ జట్టుకి అహ్మదాబాద్ లయన్స్, లక్నో జట్టుకి లక్నో యునైటెడ్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు కూడా టాక్ నడిచింది... అలాగే లక్నోలో భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకనా క్రికెట్ స్టేడియం కెపాసిటీ సుమారు 49 వేలు. లక్నో జట్టు హోం గ్రౌండ్ మ్యాచులన్నీ ఈ స్టేడియంలో జరగనున్నాయి..

అహ్మదాబాద్, లక్నో సిటీలతో పాటు కటక్, ధర్మశాల, గౌహతి, ఇండోర్ సిటీ పేర్ల మీద కూడా బిడ్డింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ సిటీ పేరు మీద ఐపీఎల్ జట్టు కోసం బిడ్డింగ్ వేసినట్టు ప్రచారం జరిగినా, అది కేవలం పుకారు మాత్రమే అని తేలిపోయింది...

అదానీ గ్రూప్, అహ్మదాబాద్ జట్టును బిడ్‌లో దక్కించుకున్నట్టు, మాంచెస్టర్ యునైటెడ్‌కి లక్నో జట్టు సొంతమైనట్టుగా దాదాపు మూడు గంటల ముందు నుంచే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అది కూడా పుకారుగానే మిగిలింది.

అదానీ గ్రూప్ కొత్త జట్టు కోసం రూ.5 వేల కోట్ల బిడ్ వేయగా, మాంచెస్టర్ యునైటెడ్ రూ.5 వేల మార్కు చేరువకి కూడా రాలేకపోయింది...

సుమారు రూ.6.5 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఆల్ కార్గో ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ కంపెనీ అధినేత, వ్యవస్థాపకుడు శశి కిరణ్ శెట్టి, ఐపీఎల్ జట్టు కోసం బిడ్డింగ్ వేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మార్కెట్‌ విలువకు సమానంగా రూ.6.4వేల కోట్లను కొత్త జట్టు కోసం బిడ్డింగ్‌గా వేశాడు శశి కిరణ్. దీంతో నిర్వహకులకు సంస్థపై అనుమానాలు రేగాయి, ఈ కారణాలతో ఐపీఎల్ కొత్త జట్ల వేలం దాదాపు రెండు గంటల పాటు ఆలస్యమైందని సమాచారం...

అదనంగా రెండు కొత్త జట్లు చేరడంతో ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు పాల్గొనాల్సి ఉంటుంది. రిటెన్షన్ పాలసీ ప్రకారం ప్రతీ జట్టుకి నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని సమాచారం. అయితే రిటైన్షన్ పాలస గురించి ఐపీఎల్ యాజమాన్యం చేసే అధికారిక ప్రకటన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది...

click me!