అతన్ని ఆడించడమే టీమిండియా చేసిన అతి పెద్ద తప్పు... ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కామెంట్స్..

First Published Oct 25, 2021, 5:35 PM IST

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లకే విజయాలు అందుతున్నాయి. పొట్టి ప్రపంచకప్‌లో గత ఏడు మ్యాచుల్లోనూ ఛేదన చేసిన జట్లకే విజయం దక్కడం విశేషం. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి.

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా... 151 పరుగుల స్కోరు చేసినా... సరైన సమయంలో వికెట్లు తీయలేక, ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేక పది వికెట్ల తేడాతో ఓడింది...

టీ20ల్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడడం, పాకిస్తాన్‌ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా విజయం సాధించడం కూడా ఇదే తొలిసారి. పాక్‌తో మ్యాచ్‌లో టాస్ దగ్గర్నుంచి టీమిండియా ఏదీ కలిసి రాలేదు. 

రోహిత్ శర్మ తొలి బంతికే అవుట్ కాగా, కెఎల్ రాహుల్ 3 పరుగులకే పెవిలియన్ చేరడంతో 6 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా.

ఆదుకుంటాడని భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా 11 పరుగులకే పెవిలియన్ చేరడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు.. 

విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ల కారణంగా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా... లేదంటే దుబాయ్‌లో అంతకుముందు రోజు జరిగిన విండీస్ మ్యాచ్‌లా అయ్యేది భారత జట్టు పరిస్థితి...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన మ్యాచుల్లో సిక్సర్ల మోత మోగించిన రవీంద్ర జడేజా కానీ, భారీ షాట్లు ఆడతాడని ఉద్దేశంతో జట్టులోకి తీసుకున్న హార్ధిక్ పాండ్యా కానీ మెరుపులు మెరిపించలేకపోయారు. 

రవీంద్ర జడేజా 13 బంతులాడి ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరగా హార్ధిక్ పాండ్యా 8 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా చేసిన అతిపెద్ద తప్పు హార్ధిక్ పాండ్యాని ఆడించడం... అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని ఆడించి ఉంటే బాగుండేది... శార్దూల్ ఠాకూర్ మ్యాచ్ టర్నర్... 

కీలక సమయంలో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి, మ్యాచ్‌ను మలుపు తిప్పడం అతని స్పెషాలిటీ... షమీ ప్లేస్‌లో అశ్విన్‌ని ఆడించి ఉంటే బాగుండేది...

జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తే, శార్దూల్ ఠాకూర్ ఏడో స్థానంలో, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌కి వచ్చేవాళ్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాండ్యా తుదిజట్టులోకి రావాలంటే బౌలింగ్ వేయాల్సిందే.. 

హార్ధిక్ పాండ్యా చాలా టాలెంటెడ్ ప్లేయర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ధిక్ పాండ్యాకి తుదిజట్టులో చోటు ఇవ్వడం అవివేకం. అదికూడా శార్దూల్ ఠాకూర్ వంటి మ్యాచ్ విన్నర్ అందుబాటులో ఉన్నప్పుడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్..

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన హార్ధిక్ పాండ్యా, ఫీల్డింగ్‌కి కూడా రాలేదు. అతన్ని స్కానింగ్‌కి పంపించిన డాక్టర్లు, రిపోర్టల తర్వాత పాండ్యా గాయం గురించి క్లారిటీ ఇవ్వనున్నారు. 

click me!