IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో గత మంగళవారం (ఏప్రిల్ 15) ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. లోస్కోరింగ్ మ్యాచ్ కావడంతో పరుగు పరుగుకు ఉత్కంఠ మరింత పెరిగింది. పంజాబ్ విసిరిన 112 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు కెకెఆర్ రంగంలోకి దిగుతుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ మైదానంలో అడుగుపెట్టడానికి సిద్దమవగా అతడివద్దకు అంపైర్ చేరుకున్నాడు. నరైన చేతిలోని బ్యాట్ కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే చెక్ చేసాడు. దీంతో ఆ బ్యాట్ ఐపిఎల్ రూల్స్ కు విరుద్దంగా ఉందని తేలింది. వెంటనే బ్యాట్ చేంజ్ చేయాల్సిందిగా అంపైర్ సూచించడంతో నరైన్ కంగుతిన్నాడు. అంపైర్ చెప్పినట్లే బ్యాట్ మార్చి బరిలోకి దిగిన నరైన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
చండీగడ్ లోని ముల్లన్ పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. కేవలం 111 పరుగులను కాపాడుకుని పంజాబ్ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన కెకెఆర్ కేవలం 112 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేకపోయింది.
ఈ పరాజయం, నరైన్ బ్యాట్ వివాదం నేపథ్యంలో కెకెఆర్ పై ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. 'ఇంతకాలం ఈ బండబ్యాట్ తో హిట్టింగ్ చేసావా నరైన్... ఇంకా మేము నిజంగానే నీకు ఇంత ట్యాలెంట్ ఉందని అనుకున్నాం' అంటూ కొందరు... 'ఎంత మోసం, ఎంత మోసం...ఐపిఎల్ నిర్వహకులను మోసం చేసి హిట్టర్ గా పేరుతెచ్చుకున్నాడు' అంటూ మరికొందరు నెటిజన్లు సునీల్ నరైన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.