Nicholas Pooran
Indian Premier League 2025 : భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలయ్యింది. 300 పైగా పరుగులు సాధిస్తుందని అనుకున్న మ్యాచ్ లో కనీసం 200 మార్క్ కూడా దాటలేకపోయింది ఎస్ఆర్‌హెచ్. కేవలం 190 పరుగులు మాత్రమే చేయగా 16.1 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేధించింది లక్నో.
లక్నో సూపర్ జాయింట్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ రాణించింది. మొదట బౌలర్ శార్దూల్ ఠాకూర్ బంతితో, తర్వాత నికోలస్ పూరన్, మార్ష్ బ్యాట్ తో మ్యాజిక్ చేసారు. దీంతో సన్ రైజర్స్ ను వారి సొంత మైదానంలోనే చిత్తుగా ఓడించగలిగింది ఎల్ఎస్జి. ఇంకో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే, ఐదు వికెట్లు చేతిలో ఉంచుకుని విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో లక్నో అన్ని విభాగాల్లో ఆధిపత్యం కొనసాగించింది.
SRH vs LSG
పూరన్ పూనకాలు :
భారీ పరుగులతో రికార్డుల మోత మోగిస్తున్న సన్ రైజర్స్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో లక్నో బౌలర్లు సక్సెస్ అయ్యారు. భారీ హిట్టర్లను కలిగిన ఎస్ఆర్‌హెచ్ ను కేవలం 190 పరుగులకే పరిమితం చేసారు. అయితే సహజంగా హైదరాబాద్ ఆడే ధనాధన్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ లో ఎల్ఎస్జి ఆడింది. మరీముఖ్యంగా నికోలస్ పూరస్ పూనకం వచ్చినట్లుగా ఆడాడు.
191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో టీం ఆరంభంలోనే ఓపెనర్ మార్క్రమ్ వికెట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన పూరన్ భారీ షాట్లతో విరుచుకుపడుతూ మ్యాచ్ ను వన్ సైడ్ చేసేసాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. 26 బంతుల్లోనే 70 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్సర్లు) బాది ఎల్ఎస్జి విజయాన్ని ఖాయం చేసాడు. కమిన్స్ ఇతడి దూకుడును నిలువరించాడు... కానీ అప్పటికే చేయాల్సిన నష్టం చేసేసాడు పూరన్.
పూరన్ ఔటయ్యాక మిచెల్ మార్ష్ బాదుడు ప్రారంభించాడు. అతడు కేవలం 31 బంతుల్లోనే 52 పరుగులు (7 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. ఇతడి వికెట్ కూడా కమిన్స్ తీసాడు. చివర్లో రిషబ్ పంత్, ఆయుష్ బదోని వెంటవెంటనే ఔటయినా అబ్దుల్ సమద్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 8 బంతుల్లోనే 2 సిక్సర్లు, 2 ఫోర్లు సాయంతో 22 పరుగులు చేసాడు. దీంతో మరో నాలుగు ఓవర్లు మిగిలివుండగానే లక్నో విజయం సాధించింది.
SRH vs LSG
నిరాశపర్చిన సన్ రైజర్స్ బ్యాటింగ్ :
భారీ హిట్టర్లతో కూడిన సన్ రైజర్స్ మొదటి మ్యాచ్ లో భారీ స్కోరు సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో కూడా ఇలాంటి భారీ హిట్టింగ్ చూడవచ్చని అభిమానులు భావించారు. కానీ ఎల్ఎస్జి బౌలర్లు హైదరాబాద్ ఆటలు సాగనివ్వలేదు.
ఓపెనర్ అభిషేక్ శర్మ, గత మ్యాచ్ లో సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ వరుస బంతుల్లో ఔటయ్యారు. శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బంతులతో వీరిని పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత హెడ్ కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు... 28 బంతుల్లో 47 పరుగులు(5 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదిన అతడిని ప్రిన్స్ యాదవ్ ఔట్ చేసాడు.
ఇన నితీష్ కుమార్ రెడ్డి 32 పరుగులు, క్లాసేన్ 26 పరుగులు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసారు. కానీ వారిలో నితీష్ ను రవి బిష్ణోయ్ ఔట్ చేయగా క్లాసెన్ అనుకోని విధంగా రనౌట్ అయ్యాడు. చివర్లో అనికేత్ వర్మ కేవలం 13 బంతుల్లోనే 36 పరుగులు (5 సిక్సర్లు), కెప్టెన్ కమ్మిన్స్ 4 బంతుల్లో 18 పరుగులు (3 సిక్సర్లు) బాదడంతో సన్ రైజర్స్ 190 పరుగులు చేయగలిగింది.