Rishabh Pant ruled out of Delhi Capitals: రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముందు రిషబ్ పంత్ కు బిగ్ షాక్ తగిలిందని సమాచారం. పలు మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీని పంత్ కోల్పోనున్నాడు. కెప్టెన్సీని మార్చినప్పటికీ అతను ఫ్రాంచైజీకి కీలక ఆటగాడిగా ఉంటాడని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అతనిని టాప్ రిటెన్షన్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. కెప్టెన్సీ ఒత్తిళ్ల నుంచి అతడికి ఉపశమనం కలిగించడం వల్ల మైదానంలో అతని ప్రదర్శన మెరుగుపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడిందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం లేదనీ, ఫ్రాంచైజీ సారథి పాత్ర కోసం ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్‌ను పరిశీలిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక నివేదించింది. ఇదే సమయంలో అక్షర్ పటేల్ కాకపోతే ఐపీఎల్ మెగా వేలం సమయంలో మరో ప్లేయర్ తో కెప్టెన్సీని భర్తీ చేయవచ్చని చూస్తున్నదని పేర్కొంది.
కెప్టెన్సీని మార్చినప్పటికీ, పంత్ ఫ్రాంచైజీకి కీలక ఆటగాడిగా ఉండనున్నాడు. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్ లో రిషబ్ పంత్ ఢిల్లీ తరఫున చాలా కాలం తర్వాత గ్రౌండ్ లోకి వచ్చి మంచి ఇన్నింగ్స్ లను ఆడాడు. అతని పై జట్టు ఒత్తిడి లేకుండా చేయడానికి కెప్టెన్సీని మరో ప్లేయర్ కు అప్పగిస్తున్నారని ఇప్పుడు టాక్ నడుస్తోంది. అలాగే, రిషబ్ పంత్ ను టాప్ రిటెన్షన్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారనీ, . కెప్టెన్సీ ఒత్తిళ్ల నుంచి అతడికి ఉపశమనం కలిగించడం వల్ల మైదానంలో అతని ప్రదర్శన మెరుగుపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని పొందలేకపోయింది, 2020లో ఫైనల్స్‌కు చేరుకోవడం ఐపీఎల్ లీగ్ వారి అత్యుత్తమ మెరుగైన ప్రదర్శనగా నిలిచింది. ప్రస్తుతం క్రికెట్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ నుండి ఢిల్లీ ఫ్రాంచైజీకి మారి కెప్టెన్సీని చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా ఉన్నాయి, అయితే ఈ నివేదికలు ధృవీకరించబడలేదు. జట్టు రాబోయే సీజన్‌కు సిద్ధమవుతున్నందున కెప్టెన్సీ, గెలుపు వ్యూహాల గురించి చర్చలు ఊపందుకుంటున్నాయి.
భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదం తర్వాత క్రికెట్ గ్రౌండ్ కు ఏడాదికి పైగా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అద్భుత పునరాగమనం చేశాడు. ఎడమచేతి వాటం అటాకింగ్ బ్యాటర్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీఎల్ 2024 తో మళ్లీ బ్యాట్ పట్టాడు. భయంకరమైన కారు ప్రమాదం తర్వాత 2023 సీజన్ మొత్తానికి దూరం అయిన సంగతి తెలిసిందే. పంత్ భారత వన్డే, టెస్ట్ క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టుతో ఉండి ఐసీసీ టీT20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు.
గత నెలలో బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించిన పలు రూల్స్ ను ప్రకటించింది. ఇందులో ప్లేయర్ల రిటెన్షన్, క్యాప్డ్, అన్ క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు కూడా ఉన్నాయి. బీసీసీఐ ఐపీఎల్ ప్లేయర్ నిబంధనలను ప్రకటించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్థ్ జిందాల్ మాట్లాడుతూ రిషబ్ పంత్‌ను తమ ఫ్రాంచైజీ ఖచ్చితంగా ఉంచుకుంటుందని తెలిపాడు.
"అవును, మేము ఖచ్చితంగా పంత్ ను రిటైన్ చేయాలి. మా జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు నియమాలు వచ్చాయి, కాబట్టి GMR, మా క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత, నిర్ణయాలు తీసుకుంటారు. రిషబ్ పంత్ ఖచ్చితంగా ఉంటారు. అతన్ని రిటైన్ చేసుకుంటాం" అని మీడియాతో పేర్కొన్నారు.
అలాగే, "మా జట్టులో అద్భుతమైన ఆటగాడు అయిన అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నారు. వేలంలో ఏమి జరుగుతుందో చూద్దాం. అయితే మొదట, నిబంధనల ప్రకారం మేము చర్చల తర్వాత వేలం బరిలోకి దిగుతాం. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దమని అన్నారు.
కాగా, కొత్త ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్రస్తుత జట్టులో మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఇది నిలుపుదల ద్వారా లేదా రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ఉపయోగించడం ద్వారా చేయవచ్చు. ఆరు రిటెన్షన్‌లు/ RTMలు గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్‌లను (భారతీయ & ఓవర్సీస్), గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకోవచ్చు.