ఐపీఎల్ 2025 రిటెన్ష‌న్: కేఎల్ రాహుల్ నుంచి రిష‌బ్ పంత్ వ‌ర‌కు.. IPL టీమ్స్ వ‌దులుకున్న టాప్-5 ప్లేయ‌ర్లు

First Published | Oct 29, 2024, 4:52 PM IST

IPL 2025 Retention: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ చివరి వారంలో నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది. ఈ ఈవెంట్‌కు ముందు ఫ్రాంచైజీలు తమ ప్లేయ‌ర్ల రిటెన్ష‌న్ ను ఖ‌రారు చేయ‌నున్నాయి. అయితే, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స్టార్ ప్లేయ‌ర్ల‌ను జ‌ట్లు వ‌దులుకుంటున్నాయి. 

Rishabh Pant, KL Rahul, Riyan Parag

IPL 2025 Retention: వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజ‌న్ కోసం ఇప్ప‌టికే భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ), ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఏర్పాట్ల‌ను  ముమ్మ‌రం చేశాయి. ఒక్కొక్క‌టిగా అన్ని ప‌నుల‌ను పూర్తి చేసే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ కు ముందు ఆట‌గాళ్ల కోసం మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. 

రిటెన్ష‌న్ నిబంధ‌న‌లు సైతం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ప్ర‌తి జ‌ట్టు ఆరుగురు ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకోవ‌చ్చు. వేలం నియమాల ప్రకారం ఫ్రాంచైజీలు డైరెక్ట్ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ఉపయోగించి గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను తిరిగి జ‌ట్టుతోనే ఉంచుకునే అవ‌కాశం క‌ల్పించారు. పరిమిత రిటెన్ష‌న్ల కారణంగా ఫ్రాంచైజీలు బిగ్ స్టార్ల‌ను సైతం వ‌దులుకోక త‌ప్ప‌డం లేదు. అయితే, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స్టార్ ప్లేయ‌ర్ల ను కూడా వ‌దులుకోవ‌డానికి ఫ్రాంఛైజీలు సిద్ధ‌మ‌య్యాయ‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ జాబితాలోని టాప్-5 ప్లేయ‌ర్ల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

1. కేఎల్ రాహుల్ (ల‌క్నో సూప‌ర్ జెయింట్స్) 

భార‌త స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ గా త‌న ఆట‌తో స‌త్తా చాటాడు కేఎల్ రాహుల్. అత‌నితో 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రూ. 18 కోట్లకు సంతకం చేసింది. అతను మూడు సీజన్లలో ల‌క్నో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. పేలవమైన ఫామ్, గాయాల కారణంగా లక్నో జట్టు కేఎల్ రాహుల్ ను రిటైన్ చేసుకునే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.

కేఎల్ రాహుల్ గ‌త మూడు సీజన్లలో రెండు సార్లు ఫ్రాంచైజీని ప్లేఆఫ్స్‌కు తీసుకువెళ్లాడు. మీడియా నివేదికల ప్రకారం లక్నో జట్టు మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్‌లను రిటైన్ చేసుకుంటుంద‌ని స‌మాచారం. కేఎల్ రాహుల్ 38 మ్యాచ్‌ల్లో 1410 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ పై చ‌ర్చ సాగింది. స్లో స్ట్రైక్ రేట్, అలాగే గ‌త సీజ‌న్ లో ఫ్రాంఛైజీతో విభేదాల న‌డుమ కేఎల్ రాహుల్ ను రాబోయే ఐపీఎల్ 2025  సీజ‌న్ కు ముందు ల‌క్నో టీమ్ వ‌దులుకుంటుంద‌ని స‌మాచారం. 


Rishabh Pant

2. రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) 

రిషబ్ పంత్‌ను నిలబెట్టుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు సులభమైన పని అని భావించారు, కానీ ఇప్పుడు అతను జట్టు నుండి తప్పుకుంటాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్‌తో అతని సంబంధాలు క్షీణిస్తున్నాయని ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 

మీడియా నివేదిక‌లు, క్రికెట్ స‌ర్కిల్ టాక్ ప్ర‌కారం.. ఢిల్లీ టీమ్ రిష‌బ్ పంత్ ను మ‌ళ్లీ రిటైన్ చేసుకునే అవ‌కాశం లేద‌ని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో పంత్ ఆట‌తీరుపై చాలా ఫ్రాంచైజీలు సంతోషిస్తున్నాయి. అత‌న్ని ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న టీమ్ ల‌లో ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ముందుంది. అలాగే, రిషబ్ పంత్ వేలంలోకి వ‌స్తే అత‌న్ని ద‌క్కించుకోవ‌డానికి త‌న‌ పర్స్ లో ఎక్కువ‌గా ఉంచుకునే ప్ర‌య‌త్నాలు పంజాబ్ కింగ్స్ కూడా చేస్తోంది. 

3. ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) 

ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) 40 ఏళ్ల ఫాఫ్ డుప్లెసిస్‌ను ఐపీఎల్ 2025కి ముందు విడుదల చేయనుంద‌ని స‌మాచారం. ఫ్రాంచైజీ ఇతర విదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. డుప్లెసిస్ అనేక టీ20 లీగ్‌లలో క్రమం తప్పకుండా అద్భుత‌మైన ఆట‌తో రాణిస్తున్నాడు. అయితే, ప్ర‌స్తుతం అత‌ని వ‌య‌స్సు 40 సంవత్సరాలు.

ఈ నేప‌థ్యంలోనే ఆర్సీబీ టీమ్ త‌న దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ఫాఫ్ డుప్లెసిస్‌ను విడుద‌ల చేసే అవ‌కాశ‌ముంది. అయితే, ఇది అంత తెలివైన నిర్ణ‌యం కాద‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లను అధిగమించగల గ్లెన్ మాక్స్‌వెల్, విల్ జాక్వెస్, కామెరాన్ గ్రీన్ వంటి విదేశీ ఎంపికలు కూడా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) వద్ద ఉన్నాయి.

4. పాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయ‌ర్, కెప్టెన్ గా అనేక విజ‌యాలు అందించిన ప్లేయ‌ర్ పాట్ క‌మ్మిన్స్.  అతని నాయకత్వం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్ర‌యాణంలో అద్భుతమైన మలుపులో కీలక పాత్ర పోషించింది. అయితే, సన్‌రైజర్స్ ఇతర విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై దృష్టి పెట్టవచ్చు.

ఆర్టీఎం ద్వారా కమిన్స్‌ను మళ్లీ వేలంలోకి తీసుకురావాలని హైదరాబాద్ జట్టు ఆలోచిస్తోంది. ఫ్రాంచైజీ ప్రస్తుతం అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌లను కొనసాగించాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ న‌లుగురు ప్లేయ‌ర్లు స‌న్ రైజ‌ర్స్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. 

5. శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) 

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 2024లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. గౌత‌మ్ గంభీర్ త‌ర్వాత కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ కోల్ క‌తా టీమ్ కు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. అయితే, అయ్యర్ రీసెంట్ ఫామ్ గొప్ప‌గా లేక‌పోవ‌డంతో కేకేఆర్ ఆలోచ‌న‌లో ప‌డింది. 

ఫామ్ లో లేక‌పోవ‌డంతో శ్రేయాస్ అయ్య‌ర్ భార‌త జ‌ట్టులో కూడా చోటుద‌క్కించుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. గత సీజన్‌లో అయ్యర్ 14 మ్యాచ్‌ల్లో 351 పరుగులు చేశాడు. అయితే, శ్రేయాస్ అయ్య‌ర్ తో పాటు కేకేఆర్ కు అనేక విదేశీ ఎంపికలు కూడా ఉన్నాయి. వీరికి శ్రేయస్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండవచ్చు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తిలను రిటైన్ చేయాలని కేకేఆర్ టీమ్ ఆలోచిస్తోంది. హర్షిత్ రానా అన్‌క్యాప్డ్ ఛాయిస్ కావచ్చు.

Latest Videos

click me!