ఐపీఎల్ ఫైనల్‌లో అత్యధిక పరుగులు సాధించిందెవరు..? చిన్న తాలా రికార్డు‌కు పోటీ వచ్చేనా..?

First Published May 28, 2023, 4:33 PM IST

IPL 2023: ఐపీఎల్  -16 లో  నేటి  రాత్రి  చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్  వేదికగా తుది పోరు జరుగనుంది. 

ఐపీఎల్- 16  తుదిపోరుకు మరికొద్దిసేపట్లో  తెరలేవనుంది.  ఫైనల్ పోరు  చెన్నై సూపర్ కింగ్స్ -  గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగనుంది. ఈ నేపథ్యంలో  ఇప్పటివరకూ ఫైనల్  లో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.. 

ఐపీఎల్ ఫైనల్స్ లో అత్యధిక పరుగులు చేసిన  రికార్డు  చెన్నై సూపర్ కింగ్స్  అభిమానులు చిన్నతాలా అని పిలుచుకునే సురేశ్ రైనా పేరిట ఉంది.   రైనా 8 ఫైనల్స్ ఆడి  35.57 సగటుతో 249 పరుగులు చేశాడు.   ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 

రెండో స్థానంలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్  ఉన్నాడు. వాట్సన్.. 4 ఐపీఎల్ ఫైనల్స్ లో  236 రన్స్ చేశాడు.  ఇందులో ఓ సెంచరీతో పాటు  ఓ అర్థ సెంచరీ కూడా ఉంది.  అంతేగాక ఐపీఎల్ ఫైనల్ లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు వాట్సన్.  ఫైనల్స్ తో అత్యధిక వ్యక్తిగత స్కోరు (117) అతడి పేరిటే ఉంది.  

ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్.. 6 ఐపీఎల్ ఫైనల్స్ లో  30.50 సగటుతో 183 రన్స్ చేశాడు.  ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. 

సీఎస్కే మాజీ ఓపెనర్ మురళీ విజయ్  4 ఐపీఎల్ ఫైనల్స్ ఆడి  ఒక అర్థ సెంచరీతో  181 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.   ఫైనల్స్ లో అతడి వ్యక్తిగత స్కోరు  95. ఆర్సీబీపై  విజయ్ ఈ ఘనత అందుకున్నాడు. 

చెన్నై   సారథి  మహేంద్ర సింగ్ ధోని.. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ధోని.. 8 ఐపీఎల్ ఫైనల్ ఇన్నింగ్స్ లలో  36 సగటుతో  180 పరుగులు చేశాడు.    2013లో ముంబై ఇండియన్స్ తో ఫైనల్ లో 63 పరుగులు చేసిన ధోని  నాటౌట్ గా నిలవడం  గమనార్హం. 

click me!