IPL 2023: ఐపీఎల్ ట్రోఫీ మీద రాసి ఉన్న సంస్కృత పదాలకు అర్థం ఏంటి..?

First Published May 28, 2023, 5:06 PM IST

IPL 2023: ఐపీఎల్ - 16లో నేడు  గుజరాత్ - చెన్నైలు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో విజేతలకు అందజేయబోయే  ట్రోఫీ మీద ఉండే సంస్కృత  పదాలకు అర్థం ఏంటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. 

రెండు నెలలుగా  దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతున్న ఐపీఎల్  -16  లో నేడు తుది పోరు జరుగుతుంది.   చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య   నేటి రాత్రి అహ్మదాబాద్ వేదికగా ఫైనల్  జరుగబోతున్నది. 

అయితే ఈ టోర్నీలో విజేతలకు అందించే ఐపీఎల్ ట్రోఫీ మీద  సంస్కృతంలో నాలుగు  పదాలు రాసి ఉన్నాయి. దానిని మీరు ఎప్పుడైనా గమనించారా..? ‘యత్ర ప్రతిభ అవసర ప్రప్నోహితి’ అని ఐపీఎల్ ట్రోఫీ మధ్యలో   రాసి ఉంటుంది.  

ఫైనల్ నేపథ్యంలో  దీనికి అర్థం ఏంటా..? అని  నెటిజన్లు గూగుల్ తల్లి సాయం కోరారు.   ఈ సంస్కృత పదాలకు ఇంగ్లీష్లో ‘వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ’ అని అర్థం. తెలుగులో విడమరిచి చెప్పాలంటే.. ‘ఎక్కడైతే ప్రతిభ ఉందో అది అవకాశాన్ని కలిసే చోటు..’ అని చెప్పొచ్చు.

ఐపీఎల్ మెయిన్ థీమ్ కూడా ఇదే కావడం గమనార్హం. స్వదేశీ ఆటగాళ్లను అంతర్జాతీయ స్టార్లతో కలిపి వారి అనుభవాన్ని కుర్రాళ్లకు పంచుతూ.. యువతరంగాలను  భావి క్రికెటర్లుగా మర్చడమే  ఐపీఎల్ ప్రధాన ఉద్దేశం. ఇది  ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఐపీఎల్ ద్వారా వందలాది మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. 

దేశవాళీలో అవకాశాలు లేక.. తమ ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదని  మగ్గిపోయిన  చాలా మంది యువ క్రికెటర్లకు ఐపీఎల్ ఒక అద్భుత వేదికైంది. బార్బర్ పనిచేసే ఒక వ్యక్తి కొడుకు  రాజస్తాన్ రాయల్స్ లో బౌలర్ (కుల్దీప్ సేన్) గా ఎదిగాడు.   పానీ పూరీ అమ్ముకునే తండ్రిని.. ‘నా కొడుకు యశస్వి జైస్వాల్’ అని ఘనంగా చేసిందీ ఐపీఎల్ అనడంలో సందేహం లేదు.  స్వీపర్  పని చేసి రోజు గడవడమే కష్టంగా ఉందన్న  రింకూ సింగ్ ను ఓవర్ నైట్ స్టార్ చేసిందీ ఈ లీగే..  

ఎక్కడో  కాశ్మీర్ కొండల్లో ఉండే  ఉమ్రాన్ మాలిక్ ప్రతిభను  ప్రపంచానికి పరిచయం చేసింది ఐపీఎల్. బరోడా జట్టుకు  ఆడుకుంటున్న హార్ధిక్ పాండ్యాను  భారత ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దింది.  ముంబై ఇండియన్స్ లో పేసర్ గా ఎదిగిన బుమ్రాను  భారత స్టార్ బౌలర్ గా చేసిందీ ఐపీఎలే.

click me!