ఈ బౌలింగ్‌తో ఇక్కడిదాకా రావడమే గొప్ప రోహిత్.. ముంబై ఓడినా పాజిటివ్ అంశాలు బోలెడు..!

First Published May 27, 2023, 10:12 AM IST

IPL 2023 Playoffs: ఐపీఎల్- 16లో ఐదు  సార్లు ఛాంపియన్  ముంబై ఇండియన్స్  ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో  పడుతూ లేస్తూ  ప్లేఆఫ్స్‌కు చేరిన ముంబై..  రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ చేతిలో ఓడింది. 

ఐపీఎల్ లో మరే టీమ్ కు సాధ్యంకాని రీతిలో  ఐదు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ లో పడుతూ లేస్తూ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.  ప్లేఆఫ్స్ లో  భాగంగా ఎలిమినేటర్ ల లక్నోను ఓడించినా  రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ చేతిలో  చిత్తుగా ఓడింది.  ఫీల్డింగ్ తప్పిదాలు, గాయాలు, ఒత్తిడిని తట్టుకోక   గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇక్కడిదాకా రావడమే గొప్ప.. 

వాస్తవానికి ముంబై  ఇండియన్స్ ఫైనల్స్ ‌కు అర్హత సాధించకున్నా ఇక్కడిదాకా రావడం కూడా గొప్ప విషయమే. ముంబై  బౌలింగ్ చూసినవారికెవరికైనా ఇదే ఆలోచన రాకమానదు. అంతర్జాతీయ అనుభవం లేని బౌలర్లతో రోహిత్  సేన అద్భుతాలు చేసింది. బుమ్రాకు వెన్నుగాయం, ఆర్చర్ ‌కు ఫిట్నెస్ ఇష్యూస్ తో  నిఖార్సైన బౌలర్ లేక తంటాలు పడ్డ ముంబై ఉన్న వనరులతోనే సర్దుకుంది. 

గతేడాది ముంబై పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ లు ఆడి నాలుగు మాత్రమే గెలిచి   పదింటిలో ఓడింది.  ఈ సీజన్ లో కూడా ఫస్టాఫ్ లో  ముంబై  ఆడిన ఐదు మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలిచింది. కానీ తర్వాత పుంజుకుంది. ఈ సీజన్ లో ముంబై ఏకంగా నాలుగుసార్లు   200 ప్లస్ టార్గెట్ ను ఛేదించడం గమనార్హం.  

ఈసారి ముంబై  పేస్ అటాక్  చాలా బలహీనంగా ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.   జేసన్ బెహ్రన్‌డార్ఫ్,  ఆకాశ్ మధ్వాల్, రిలే మెరిడిత్..  వీరిని మార్చి మార్చి ప్రయోగించింది ముంబై..  సీజన్  రెండో దశ తర్వాత ఆకాశ్ డెత్ ఓవర్లలో కాస్త కుదురుకున్నా గుజరాత్ తో మ్యాచ్ లో విఫలమయ్యాడు. బెహ్రన్‌డార్ఫ్  కూడా  పెద్దగా ప్రభావం చూపలేదు. క్రిస్ జోర్డాన్ వచ్చినా అతడు ప్రత్యర్థి టీమ్స్ లోని బ్యాటర్ల కంటే ఎక్కువ పరుగులు  చేయడానికి (ధారాళంగా పరుగులివ్వడంలో)  పోటీ పడ్డాడు.  సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ రెండు మ్యాచ్ లకే తేలిపోయాడు. 

ముంబైని ఆదుకున్నదల్లా  స్పిన్నర్  పీయూష్ చావ్లానే. ఈ వెటరన్ స్పిన్నర్..  14 మ్యాచ్ లలో 22 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో  నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.   చావ్లాతో పాటు కొన్ని మ్యాచ్ లలో హృతీక్ షోకీన్, కుమార్ కార్తీకేయలను ఆడించినా వాళ్లేమంత ప్రభావం చూపలేదు. 

పేస్ బౌలింగ్ లో మధ్వాల్ ఒక్కడే  ముంబై ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అన్నీ బాగుండి వచ్చే ఏడాది బుమ్రా.. ముంబైకి ఆడగలిగితే  అప్పుడు ఈ ఇద్దరి జోడీకి తిరుగుండకపోవచ్చు.  మరొక పేసర్ గా  పేస్ ఆల్ రౌండర్  కామెరూన్ గ్రీన్ ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే. 

Image credit: PTI

ఇక   బౌలింగ్ లో విఫలమైనా ముంబై బ్యాటింగ్ లోతు ఎంత ఉందో ఈ సీజన్ ద్వారా ప్రత్యర్థి జట్లకు అర్థమై ఉంటుంది.  రోహిత్, ఇషాన్ లు స్థాయికి తగ్గట్టు రాణించకపోయినా  సూర్యకుమార్ యాదవ్ కు తోడుగా కొత్త కుర్రాళ్లు తిలక్ వర్మ,  నెహల్ వధెర లు ఆకట్టుకున్నారు. ఇటీవల రోహిత్ ఓ ఇంటర్వ్య్యూలో మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ సూపర్ స్టార్లని.. భవిష్యత్ లో ముంబైకి కీలక పాత్ర పోషిస్తారని చెప్పడం మరువలేనిది. 

వీరికి తోడు కామెరూన్ గ్రీన్ రూపంలో ముంబైకి సూపర్ ఆల్  రౌండర్ దొరికినట్టే. ఒకట్రెండు మ్యాచ్ లలోనే ఆడినా టిమ్ డేవిడ్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. తనదైన రోజున డేవిడ్  విధ్వంసాలను   సృష్టించగల సమర్థుడు.  విష్ణు వినోద్ కూడా ఒక్క మ్యాచ్ లో ఛాన్స్ ఇస్తే తానెంటో నిరూపించుకున్నాడు.  ఇవన్నీ ముంబైకి పాజిటివ్ అంశాలే.. 

అన్నింటికీ మించి గత సీజన్ లో  10వ స్థానంలో ఉన్న జట్టు ఇప్పుడు ఏకంగా  3వ స్థానానికి చేరుకోవడం  ఆ జట్టుకు స్ఫూర్తినిచ్చేదే.   

click me!