ధోని ఖాతాలో మరో ఘనత.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు

First Published Apr 22, 2023, 5:50 PM IST

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని   ప్రపంచ క్రికెట్ లో మరో ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 

ప్రపంచ క్రికెట్ లో  సారథిగా  ఆటపై  చెరగని ముద్ర వేసిన  టీమిండియా మాజీ  కెప్టెన్  వికెట్ కీపర్ గా  కూడా  పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 41 ఏండ్ల వయసులో కూడా ధోని.. యువ వికెట్ కీపర్లకు  స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.  తాజాగా ధోని  మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.

వరల్డ్ మెన్స్ టీ20 క్రికెట్ లో   అత్యధిక క్యాచ్ లు పట్టిన  వికెట్ కీపర్ గా ధోని నిలిచాడు.   శుక్రవారం  చెన్నై - హైదరాబాద్  మధ్య జరిగిన మ్యాచ్ లో  ధోని.. మార్క్‌రమ్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. 

Latest Videos


టీ20 క్రికెట్ లో  మార్క్‌రమ్ క్యాచ్  ధోనికి  208వది.  తద్వారా అతడు సౌతాఫ్రికా  వికెట్ కీపర్ క్వింటన్ డికాక్  పేరిట ఉన్న  207 క్యాచ్ ల రికార్డును అధిగమించాడు.   తద్వారా ఈ  ఫార్మాట్ లో  ఈ ఘనత సాధించిన  తొలి భారతీయుడిగా నిలిచాడు. 

పొట్టి ఫార్మాట్  లో అత్యధిక  క్యాచ్ లు పట్టిన జాబితాలో ధోని , డికాక్  తర్వాత   టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మూడో స్థానంలో ఉన్నాడు.  కార్తీక్ టీ20 లలో  205 క్యాచ్ లు పట్టాడు.   కార్తీక్ తర్వాత పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్  (172)  టాప్ - 4లో ఉన్నాడు. 

కాగా  నిన్న సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తీక్షణ బౌలింగ్ లో  మార్క్‌రమ్ క్యాచ్ పట్టిన ధోని.. తనకు బెస్ట్ క్యాచ్ అవార్డు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. మ్యాచ్ ముగిశాక   ధోని హర్షా భోగ్లే తో మాట్లాడుతూ.. ‘మేం (వికెట్ కీపర్లు) ఇప్పటికీ గ్లవ్స్ తో నే ఉంటాం కాబట్టి  అందరూ మాకు క్యాచ్ లు పట్టడం ఈజీ అనుకుంటారు. కానీ మేం కూడా  అద్భుత క్యాచ్ లు అందుకుంటాం..’ అని నవ్వుతూ చెప్పాడు.  

ఇక చెన్నై - హైదరాబాద్ మధ్య శుక్రవారం  జరిగిన  మ్యాచ్ లో  సీఎస్కే  ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.  తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్  నిర్ణీత 20 ఓవర్లలో  134 పరుగులే చేసింది. లక్ష్యాన్ని చెన్నై.. 18.4 ఓవర్లలోనే ఛేదించింది. డెవాన్ కాన్వే (77 నాటౌట్) రాణించాడు.   
 

click me!