అట్టడుగు నుంచి అగ్రస్థానానికి.. వింటేజ్ సీఎస్కే ఈజ్ బ్యాక్!

First Published Apr 24, 2023, 11:54 AM IST

IPL 2023: ఐపీఎల్  లో అత్యధిక విజయవంతమైన జట్లలో ఉన్న టాప్ -2 టీమ్స్ లో ముంబై ఇండియన్స్ తో పాటు  చెన్నై సూపర్ కింగ్స్  కూడా ఒకటి. అయితే గతేడాది  చెన్నై  పాయింట్ల  పట్టికలో అట్టడుగున నిలిచింది. 

ఐపీఎల్ లో ఒక్క కప్పు కొట్టడానికి ఆర్సీబీ  పదిహేనేండ్లుగా  ‘ఈసాలా కప్ నమ్దే’ అనుకుంటూ ఒకే కలను  మార్చి మార్చి కంటున్నది.    ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ  క్యాపిటల్స్ కూడా ఇవే కోవలోకి వచ్చేవే. రెండుసార్లు కప్ కొట్టిన కేకేఆర్,  ఒక్కోసారి కప్ కొట్టిన రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లు మళ్లీ టోర్నీలో మెరిసేందుకు నానా తంటాలు పడుతున్నాయి. 

కానీ  చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐపీఎల్ లో మరెవరికీ సాధ్యం కాని రీతిలో  ఏకంగా 9 ఫైనల్స్ ఆడింది.  ఇందులో నాలుగుసార్లు కప్ కొట్టింది.  ఐదు సార్లు రన్నరప్ గా నిలిచింది. ఐపీఎల్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న సీఎస్కే గతేడాది మాత్రం  పాయింట్ల పట్టికలో ముంబైతో కలిసి  అట్టడుగున నిలిచింది. 

Latest Videos


2022 సీజన్ లో  సీఎస్కే..  14 మ్యాచ్ లు ఆడి నాలుగు మాత్రమే గెలిచి  పది మ్యాచ్ లు ఓడింది.  దీంతో  లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది ధోనిసేన. ఆ సీజన్ లో చెన్నై ఓటమికి కారణాలు అనేకం. అదే రిపీట్ అయితే  చెన్నై కథ కంచికే అన్నారు ఐపీఎల్ అభిమానులు. కొత్త జట్లు గుజరాత్, లక్నోల రాకకు తోడు రాజస్తాన్ రాయల్స్  దృఢంగా మారడం ఒకటైతే డాడీస్ టీమ్ గా ముద్ర వేసుకున్న ధోని సేన.. గత సీజన్ లో పేలవ ఆటతీరుతో నిరాశపరించింది. 

కానీ   ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ -16లో చెన్నై  మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది.   ఏప్రిల్ 23  నాటికి  ఉన్న పాయింట్ల పట్టికలో  సీఎస్కే.. 7 మ్యాచ్ లు ఆడి  ఐదింటిలో గెలిచి రెండు ఓడి పది పాయింట్లతో  నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.  ఈ సీజన్ లో పది పాయింట్లు సాధించిన తొలి టీమ్ కూడా సీఎస్కేనే.  నెట్ రన్ రేట్ (+0.662) కూడా మెరుగ్గానే ఉంది.  

చెన్నైకి  గత సీజన్ తో  పోలిస్తే  ఈసారి కష్టాలు మరింత ఉన్నా ఆ జట్టు రాణిస్తుండటం గమనార్హం. గతేడాది దీపక్ చాహర్ గాయంతో ముఖేశ్ కుమార్   పేస్ దళాన్ని నడిపించాడు. కానీ ఈ సీజన్ లో అతడు కూడా గాయపడ్డాడు. దీపక్ చాహర్ ఒక్క మ్యాచే ఆడాడు.  అంతర్జాతీయ అనుభవమున్న పేసర్ ఒక్కడు కూడా లేదు. అయినా కూడా  యువ పేసర్లు ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, పతిరనలతో ధోని అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 
 

Image credit: PTI

ఇక బ్యాటింగ్ లో రుతురాజ్, కాన్వేలు ఆ జట్టు ఆస్తి.  ఈ ఓపెనింగ్ ద్వయం నిలకడగా రాణిస్తోంది. గత సీజన్ లో రుతురాజ్ తో పాటు కాన్వే కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో  చెన్నైకి శుభారంభాలు దక్కలేదు.  బెన్ స్టోక్స్ గాయంతో  టీమ్ లోకి వచ్చిన అజింక్యా రహానే  చెన్నైకి సర్‌ప్రైజ్ ప్యాకేజీలా మారాడు. ఎవరూ ఊహించని విధంగా  వన్ డౌన్ లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. 

ఈ ముగ్గురితో పాటు హిట్టర్  శివమ్ దూబే  బంతిని  బాదడంలో   నేర్పరి అయ్యాడు. చివర్లో వస్తున్న రవీంద్ర జడేజా, ధోనిలు కూడా తమవంతుగా చేయి వేస్తున్నారు.  అన్నీ కలిసివస్తున్నట్టు  చెన్నై ప్రస్తుతానికి ప్లేఆఫ్స్ కు దగ్గర్లోనే ఉంది. అయితే ఈ సీజన్ లో ఫస్టాఫ్ మాత్రమే ముగిసింది.  సెకండాఫ్ లో   మిగిలిన జట్లు పుంజకుంటే   అప్పుడు  ప్లేఆఫ్స్ కోసం హోరాహోరి పోరు తప్పదు.   ఆలోపు ఇదే జోరు కొనసాగిస్తే  ధోని తన చివరి సీజన్ లో మరో  ట్రోఫీతో   సుదీర్ఘ కెరీర్ కు ఎండ్ కార్డ్ వేయడానికి అవకాశాలుంటాయి. 

click me!