బెంగళూరులో ఏబీ డివిల్లియర్స్... ఐపీఎల్ 2023 సీజన్ కోసం పని మొదలెట్టిన ‘మిస్టర్ 360’...

First Published Nov 3, 2022, 5:16 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం దేశాలన్నీ పోటీపడుతుంటే... సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ సైలెంట్‌గా ఇండియాలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఫ్రాంఛైజీలన్నీ పనులు మొదలెట్టేశాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్లు, హెడ్ కోచ్‌ల మార్పులో బిజీగా ఉంటే...ఆర్‌సీబీ, ఏబీడీని దింపి కుర్రాళ్లను సానబెడుతోంది..

విరాట్ కోహ్లీకి ఆప్త మిత్రుడిగా మారిన ఏబీ డివిల్లియర్స్, 2011 నుంచి 2021 వరకూ బెంగళూరు జట్టు తరుపున ఆడాడు. 2011 నుంచి 2021 వరకూ ఆర్‌సీబీకి ఆడిన ఏబీ డివిల్లియర్స్, 157 మ్యాచుల్లో 2 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 4522 పరుగులు చేశాడు.. స్ట్రైయిక్ రేటు 158.33...

2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన ఏబీ డివిల్లియర్స్... 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2021 సీజన్‌లో ఆఖరి ఐపీఎల్ సీజన్ ఆడాడు ఏబీ డివిల్లియర్స్...

కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏబీ డివిల్లియర్స్, ఏ ఫార్మాట్‌ కూడా ఆడబోవడం లేదని తేల్చేశాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ సమయంలోనే ఆర్‌సీబీ తరుపున సేవలు అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్. అప్పుడు ఏబీడీ బిజీ షెడ్యూల్ వల్ల అది వీలు కాలేదు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ బృందంలో చేరిన ఏబీ డివిల్లియర్స్.. బెంగళూరుకి చేరుకున్నాడు. ‘బెంగళూరుకి రావడం సంతోషంగా ఉంది. కరోనా కారణంగా కొన్నేళ్లుగా ఇక్కడికి రాలేకపోయాను. ఇక్కడ నాకెన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి.  ఐటీసీ రాయల్ హోటల్‌కి రావడం ఇది 25వ సారి...’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు ఏబీ డివిల్లియర్స్...

ఏబీ డివిల్లియర్స్, ఆర్‌సీబీ బృందంలో చేరినట్టు ఆ ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ద్వారా కన్ఫార్మ్ చేసింది. అయితే ఏబీడీ రోల్ ఏంటనేది? ఇంకా క్లారిటీ రాలేదు. చాలామంది ఏబీ డివిల్లియర్స్, ఆర్‌సీబీకి బ్యాటింగ్ కన్సల్టెంట్ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వరుసగా మూడోసారి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. అయితే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది ఆర్‌సీబీ... 

click me!