నన్ను టీమిండియా మరిచిపోయినా నేను దానిని మాత్రం మరిచిపోలేదు : షమీ షాకింగ్ కామెంట్స్

First Published | Nov 3, 2022, 4:31 PM IST

T20 World Cup 2022: ప్రపంచకప్‌కు ముందు  టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో  సెలక్టర్లకు మరో అవకాశం లేక జట్టులోకి  వెటరన్ పేసర్ మహ్మద్ షమీని తీసుకొచ్చారు. ఈ టోర్నీలో షమీ మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు. 
 

టీ20 ప్రపంచకప్ ను  సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణిస్తున్నది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు  ముందుగా  ప్రకటించిన జట్టులో పలు మార్పులు జరిగినా.. ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంటున్నది.  బ్యాటింగ్ లో కోహ్లీ, సూర్య రాణిస్తుండగా బౌలింగ్ విభాగం ఆకట్టుకుంటున్నది. 

Image credit: Getty

బౌలింగ్ విభాగంలో  మహ్మద్ షమీ తుది జట్టులోకి రావడమే అనూహ్య పరిణామం. బుమ్రా, దీపక్ చాహర్ గాయపడటం, అవేశ్ ఖాన్ ఫామ్ కోల్పోవడంతో సెలక్టర్లకు మరో ఆప్షన్ లేక వెటరన్ ను తుది జట్టులోకి తీసుకొచ్చారు.  
 


వాస్తవానికి  గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ భారత జట్టులో  పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అసలు అతడు తమ  దృష్టిలో లేడని.. షమీని టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిగణిస్తామని  సెలక్టర్లు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.  కానీ బుమ్రా గాయంతో వాళ్లకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. 
 

అయితే  ఏడాది తర్వాత జట్టులోకి పునరాగమనం చేసినా ఈ వెటరన్ స్టార్ రాణిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు షమీ.. నాలుగు మ్యాచ్ లు ఆడి నాలుగు వికెట్లు తీశాడు. వికెట్లు తీయకున్నా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లతో కలిసి షమీ  ప్రత్యర్థి పరుగలకు  కళ్లెం వేస్తున్నాడు.  తాజాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కూడా అదే విధమైన ప్రదర్శన చేశాడు. 

మ్యాచ్ అనంతరం  షమీ మాట్లాడుతూ.. ‘నేను  ఏడాదికాలంగా భారత్ కు ఈ ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే నేను టీమ్ కు దూరంగా ఉన్నానే గానీ ప్రాక్టీస్ కు మాత్రం  మానలేదు.  ప్రతీరోజూ నా శిక్షణను కొనసాగించా..  టీమ్ మేనేజ్మెంట్ నాతో.. అవసరమైనప్పుడు సిద్ధంగా ఉండు అని చెప్పింది.  దాంతో నేను నా ప్రాక్టీస్ ను మానకుండా  నా పనిని కొనసాగించాను. మీరు నా వీడియోలు చూస్తే అందులో ఈ విషయాన్ని గమనించవచ్చు..’ అని తెలిపాడు. 

టీ20 ప్రపంచకప్ కు ఎంపిక కాకముందే షమీ స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్ లకు ఎంపికయ్యాడు. కానీ కోవిడ్ కారణంగా ఆ మ్యాచ్ లు ఆడలేదు. నేరుగా ఆస్ట్రేలియాకు రావాల్సి వచ్చింది. దీనిపై షమీ స్పందిస్తూ.. ‘ఒక ఫార్మాట్ నుంచి మరో ఫార్మాట్ కు మారడం  అంత ఈజీ కాదు. ముఖ్యంగా బౌలర్ల విషయంలో.. టీమ్ తో ఎలా కనెక్ట్ అవుతామనేది చాలా ప్రధానమైన అంశం.  అయితే నేను మాత్రం ఇవన్నింటికంటే నా ప్రాక్టీస్ మీదే దృష్టి సారించేవాడిని..’ అని  చెప్పాడు.   

Latest Videos

click me!