వన్‌ సైడ్ మ్యాచులు, స్లో పిచ్‌లు, స్టార్ల ఫెయిల్యూర్, ఆ రెండు జట్లు కూడా... ఐపీఎల్ 2022కి ఇక కష్టమే...

First Published May 13, 2022, 5:40 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది బీసీసీఐ. రెండు కొత్త జట్లను జత చేయడం ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిన బీసీసీఐ, మీడియా రైట్స్ విక్రయం ద్వారా మరో రూ.35 నుంచి రూ.40 వేల కోట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ రిజల్ట్, బీసీసీఐని షాక్‌కి గురి చేస్తోంది...

భారీ స్కోరింగ్ మ్యాచులు, ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లతో ఐపీఎల్ 2022 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే గత రెండు సీజన్లతో పోలిస్తే లాక్‌డౌన్ అమలులో లేకపోవడం, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావడంతో ఐపీఎల్‌ను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు...

ఆ సినిమాల హడావుడి తగ్గి, ఐపీఎల్ 2022 సీజన్‌కి రేటింగ్‌కి కాస్త పెరుగుతందనగా మ్యాచులు సాగుతున్న తీరు, ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన థ్రిల్లర్ మ్యాచ్ చూసే చాలా రోజులే అయ్యింది...

కొన్నాళ్లుగా సాగుతున్న మ్యాచులన్నీ ‘వార్ వన్‌సైడ్’ అన్నట్టుగా సాగుతుండడంతో మ్యాచ్ రిజల్ట్ త్వరగానే తేలిపోతోంది. ఆఖరికి ఐపీఎల్ ‘El Clasico’గా చెప్పుకునే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది...

కనీసం భారీ స్కోరింగ్ మ్యాచులు పడితే, ఫ్యాన్స్‌కి చూడాలనే ఆసక్తి కలిగేది. అయితే గత వారం రోజులుగా జరుగుతున్న మ్యాచులన్నీ లో స్కోరింగ్ మ్యాచులే. స్లో పిచ్‌ల కారణంగా భారీ స్కోర్లు నమోదుకావడమే గగనంగా మారింది..

ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లలో గ్రూప్ మ్యాచులు ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసే వరకూ ప్లేఆఫ్స్ బెర్తులపై క్లారిటీ రాలేదు. ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప మిగిలిన జట్లన్నీ ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్స్ రేసులో నిలిచాయి...

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. పంజాబ్ కింగ్స్ భవితవ్యం కూడా నేటి మ్యాచ్‌తో తేలిపోయింది. 60 మ్యాచులు ముగిసే సరికి మూడు టీమ్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటే, మిగిలిన 10 లీగ్ మ్యాచులు చూసేందుకు పెద్దగా ఆసక్తి ఉండదు...

అందులోనూ భారీ ఫాలోయింగ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడం... ఏ మాత్రం ఫాలోయింగ్ లేని కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉండడం... ఐపీఎల్ 2022 టీఆర్పీని ఘోరంగా దెబ్బ తీస్తోంది...

కనీసం స్టార్ల పర్ఫామెన్స్ బాగున్నా ఐపీఎల్ 2022 సీజన్‌కి కళ వచ్చేది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఘోరంగా విఫలం అవుతుండడం... ప్యాట్ కమ్మిన్స్, రవీంద్ర జడేజా, దీపక్ చాహార్ వంటి ప్లేయర్లు గాయాలతో సీజన్‌కి దూరం కావడంతో మిగిలిన మ్యాచుల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్... 

click me!