అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్, లక్నో కెప్టెన్‌గా కెఎల్ రాహుల్... డేవిడ్ వార్నర్‌కి ఆ జట్టు...

First Published Dec 5, 2021, 11:56 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో చాలా మార్పులు చూడడం ఖాయంగా ఉంది. లీగ్‌కి ముందు మెగా వేలం జరుగుతుండడంతో అన్ని ఫ్రాంఛైజీలు, దాదాపు కొత్త జట్లతో బరిలో దిగబోతుంటే.. కొన్ని ఫ్రాంఛైజీలు కొత్త కెప్టెన్లతో బరిలో దిగబోతున్నాయి...

అహ్మదాబాద్, లక్నో ఫ్రాంఛైజీల రాకతో గత మూడేళ్లుగా జట్లలో పాతుకుపోయిన ప్లేయర్లకు కొత్తగా రెక్కలొచ్చినట్లయ్యింది. ఐపీఎల్ మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్లేయర్లు...

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, పంజాబ్ కింగ్స్ నుంచి బయటికి వచ్చిన కెఎల్ రాహుల్, అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి బయటికి వచ్చిన డేవిడ్ వార్నర్‌లు హాట్ కేకులుగా మారారు...

కెఎల్ రాహుల్‌ను లక్నో ఫ్రాంఛైజీ కొనుగోలు చేయబోతుందని, పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్‌‌కి ఈ కొత్త జట్టు ఏకంగా రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి...

‘ఫ్రీ టికెట్’ ద్వారా కొనుగోలు చేసే ప్లేయర్లకు అత్యధికంగా రూ.15 కోట్లు చెల్లించేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో కెఎల్ రాహుల్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు లక్నో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం..

కెఎల్ రాహుల్‌తో పాటు అతని స్నేహితుడు, ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా లక్నో ఫ్రాంఛైజీలోకి వెళ్లడం ఖాయమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కెఎల్ రాహుల్‌ను వేలానికి విడుదల చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు, మయాంక్ అగర్వాల్‌ను మొదటి రిటెన్షన్‌గా అట్టిపెట్టుకుంది. వేలంలో ప్లేయర్లను బట్టి మయాంక్ అగర్వాల్‌కి కెప్టెన్సీ ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం...

అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్ చేర్చిన మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో అహ్మదాబాద్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడని సమాచారం..

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి పాత ఫ్రాంఛైజీలతో పాటు కొత్త ఫ్రాంఛైజీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయట...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం...

అలాగే డేవిడ్ వార్నర్‌ వేలంలోకి వస్తే, అతన్ని కెప్టెన్‌గా కాకుండా ప్లేయర్‌గా వాడుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా పోటీ పడవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా...

click me!