కివీస్ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లు... రచిన్ రవీంద్రకు అనంతపురంతో లింక్, మరి అజాజ్ పటేల్

First Published Nov 25, 2021, 10:38 AM IST

భారత జట్టుపై భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనేది న్యూజిలాండ్ జట్టు తీరని కోరిక. టెస్టుల్లో ఘనమైన రికార్డుతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచినా, ఉపఖండ పిచ్‌లపై న్యూజిలాండ్‌కి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. అందుకే టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఏకంగా ఇద్దరు భారత ప్లేయర్లతో బరిలో దిగుతోంది కివీస్...

భారత పర్యటనలో భారత జట్టును దెబ్బతీసేందుకు భారత ప్లేయర్‌తోనే బరిలో దిగాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది న్యూజిలాండ్. తొలి టెస్టు ఆడుతున్న కివీస్ 11 మంది జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లు ఉండడం విశేషం...

తొలి టెస్టు ద్వారా భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ ద్వారా టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఆరు టీ20 మ్యాచులు ఆడిన రచిన్ రవీంద్ర, బ్యాటుతో 54 పరుగులు చేసి బంతితో 6 వికెట్లు తీశాడు... 

వాస్తవానికి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో రచిన్ రవీంద్రకి చోటు దక్కింది. అయితే తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు రచిన్ రవీంద్ర... 

21 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు...

అక్కడే పుట్టి పెరిగిన రచిన్ రవీంద్ర, క్రికెట్‌లో రాటుతేలింది మాత్రం ఇక్కడే. ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లని అనంతపురంలో ఉన్న ఆర్‌డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్)కి వచ్చి క్రికెట్ ఆడతుండేవాడట రచిన్...

తన తండ్రి రవి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరుపున రచిన్ రవీంద్రతో పాటు చాలామంది ప్లేయర్లు, న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడుతుండేవారట...

‘హట్ హాక్స్ క్లబ్ తరుపున ఆడే రచిన్ రవీంద్ర, అనంతపురంలోని ఆర్‌డీటీలో నాలుగేళ్లుగా క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అతను న్యూజిలాండ్ జట్టుకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది..’ అంటూ తెలిపాడు ఆంధ్రా క్రికెట్ అకాడమీ కోచ్ సయ్యద్ షాబుద్దీన్.

బ్యాటుతో బాల్‌తో అదరగొడుతూ మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రచిన్ రవీంద్ర ఫెవరెట్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్...

అలాగే అతితక్కువ మ్యాచుల్లో కివీస్ జట్టులో కీలక స్పిన్నర్‌గా మారిన అజాజ్ పటేల్ కూడా భారత సంతతి ఆటగాడే. ముంబైలో జన్మించిన అజాజ్ పటేల్, న్యూజిలాండ్‌కి వలసవెళ్లి అక్లాండ్‌లో సెటిల్ అయ్యాడు...

9 టెస్టుల్లో 26 వికెట్లు తీసిన అజాజ్ పటేల్, పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ ఇద్దరూ సొంత దేశం భారత్‌పై ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

click me!