ఇది సరైన పద్ధతి కాదు, మూడేళ్లకోసారి ఇలా... ఐపీఎల్ మెగా వేలంపై ఢిల్లీ క్యాపిటల్స్. కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

First Published Dec 2, 2021, 1:26 PM IST

ఐపీఎల్‌లో ప్రతీ మూడేళ్లకోసారి ప్రతీ జట్టులో మార్పులు చేయాలనే ఉద్దేశంతో మెగా వేలం కాన్సెప్ట్‌ను రూపొందించింది బీసీసీఐ. అయితే మూడేళ్లు కష్టపడి, తయారుచేసుకున్న జట్టును కోల్పోవాల్సి రావడంతో ఫ్రాంఛైజీలు, ఈ మెగా వేలం పాలసీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి..

‘ఐపీఎల్‌ మెగా వేలం నిర్వహించాల్సిన అవసరం ఉందా? మూడేళ్ల పాటు కష్టపడి, ఎంతో సమయాన్ని, డబ్బును ఖర్చు పెట్టి తయారుచేసిన టీమ్‌ను ఈ మెగా వేలం కారణంగా కోల్పోవాల్సి వస్తోంది...

మళ్లీ కొత్త ప్లేయర్లు, కొత్త కాంబినేషన్స్... ప్రతీ మూడేళ్లకోసారి కొత్తగా టీమ్‌ను నిర్మించాల్సి రావడం చాలా కష్టంగా ఉంది. వేలంలో ఓ ప్లేయర్‌ను కోట్లు పెట్టి కొనేది, అతను జట్టుకి సుదీర్ఘకాలం ఉపయోగపడతాడనే కదా..

అలాకాకుండా ప్రతీ మూడేళ్ల కోసం నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకోవాలంటే ఎలా? ఇది సరైన పద్ధతి కాదు. బీసీసీఐ దీని గురించి మరోసారి ఆలోచించాలి...’ అంటూ కామెంట్ చేశారు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్...

‘శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, కగిసో రబాడా, అశ్విన్ లాంటి ప్లేయర్లను కోల్పోవడం చాలా బాధగా అనిపించింది. టీమ్‌కి ఇది ఓ భావోద్వేగ సమయం... ఇది మెగా వేలం నిర్వహించడం అంత అవసరమా...

ఐపీఎల్‌ ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి, వాళ్లు రాటుతేలేలా సాన బెట్టి... టీమ్‌కి అవసరమయ్యేలా తయారుచేస్తాం...

వాళ్లు భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసి, స్టార్లుగా ఎదుగుతారు. ఫ్రాంఛైజీ కోసం ఆడతారనే ఉద్దేశంతోనే ఇంత చేస్తే, ఓ టీమ్‌ని నిర్మించిన తర్వాత ప్రతీ మూడేళ్లకోసారి కీ ప్లేయర్లను కోల్పోవాల్సి వస్తోంది...

ఇప్పటికే లీగ్ మొదలై 14 ఏళ్లు దాటింది. ఇకపై మెగా వేలం నిర్వహించడం అనవసరమనే నాకు అనిపిస్తోంది... ’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్...

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ వస్తుండడంతో మెగా వేలం నిర్వహించడం అనివార్యమైంది. అయితే ఇకపై మెగా వేలం నిర్వహించకూడదని బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం...

ఐపీఎల్ 2022 మెగా వేలం చివరిదని, ఇకపై ప్రతీ మూడేళ్లకోసారి మెగా వేలం నిర్వహించే ఆలోచనను బీసీసీఐ విరమించుకుందని... కేవలం ప్రతీ ఏటా వేలం మాత్రమే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట...

click me!