MS DHONI: చెన్నైకి మెంటార్ గా ధోని? మేనేజ్మెంట్ ఆలోచనా అదే..! ఆక్షన్ కు వెళ్లినా వదలమంటున్న సీఎస్కే యాజమాన్యం

First Published Oct 7, 2021, 6:30 PM IST

Chennai super kings: చెన్నైకి భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి విడదీయరాని బంధం ఉంది. ఐపీఎల్ మొదటి నుంచి ఆ జట్టుకే ఆడుతున్న ఈ కెప్టెన్ కూల్.. మూడు సార్లు ఆ జట్టుకు ఐపీఎల్ కప్ అందించాడు.

సుమారు పదిహేనేళ్ల పాటు  భారత క్రికెట్ జట్టుకు వివిధ స్థాయిలలో సేవలందించిన మాజీ సారథి ఎంఎస్ ధోని ఏం చేసినా సంచలనమే. అతడి నిర్ణయాలు కంప్యూటర్ కన్నా వేగంగా ఉంటాయి. అయితే ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి  వైదొలిగిన ఈ చెన్నై నాయకుడు.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతానని ఓ హింట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ దానిలో మెలిక పెట్టేశాడు.  వచ్చే ఐపీఎల్ లో తాను చెన్నై తరఫున ఆడుతానా..? లేక కొత్త టీమ్ తరఫున ఆడుతానా..? అనేదానిమీద తనకే స్పష్టత లేదని ఫ్యాన్స్ ను తికమకలో పడేశాడు. 

ఈ నేపథ్యంలో ధోని భవితవ్యంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. అయితే అతడు చెన్నై తరఫునే ఆడతాడని అభిమానులు భావిస్తుండగా.. మరోవైపు ధోని.. సీఎస్కే  నుంచి బయటకు వచ్చి వేలంలో పాల్గొనవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ధోని అడుగులు ఎటువైపు పడుతున్నాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న..

మిస్టర్ కూల్ కెప్టెన్ తో చెన్నైది 14 ఏండ్ల బంధం. ఐపీఎల్ ప్రారంభమైనప్పట్నుంచి (2008).. అతడు తమిళ తంబీల వెంటే ఉన్నాడు. 2015లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై.. ఐపీఎల్  నుంచి సస్పెండ్ అయినా అతడు సీఎస్కే ను వీడలేదు. మధ్యలో పూణె తరఫున ఆడినా మళ్లీ చెన్నై 2018లో ఐపీఎల్ లో రావడంతో ఆ జట్టులో చేరాడు. మూడు సార్లు చెన్నైకి ట్రోఫీ అందించిన అతడు.. ఏకంగా ఆరుసార్లు సీఎస్కేను ఫైనల్స్ కు చేర్చాడు.

తమిళనాట సినిమాలలో రజినీకాంత్, దళపతి విజయ్ కు ఎంత ఆదరణ ఉందో.. ధోనికి అంతే అభిమానమూ ఉంది. చెన్నై అభిమానులు అతడిని క్రికెట్ దళపతి గా పిలుచుకుంటారు. మెరీనా బీచ్, చెపాక్ స్టేడియం, రజినీకాంత్, ఎంఎస్ ధోని.. ఇవి మా ఎమెషన్స్ అంటుంటారు తమిళ తంబీలు. ధోని ఆడినా ఆడకున్నా అతడు వారికి ఎప్పటికీ తరిగిపోని ఆస్తి.

తమ సొంత రాష్ట్రంలోని స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయినా వదులుకోవడానికి సిద్ధమైన చెన్నై ఫ్రాంఛైజీ.. ధోనిని మాత్రం కోల్పోవడానికి సిద్ధపడలేదంటే అర్థం చేసుకోవచ్చు. ధోని లేని చెన్నై జట్టును తాము చూడలేమని తేల్చి చెప్పేశారు అభిమానులతో పాటు యాజమాన్యం. 

వాస్తవానికి ధోని.. 2020 తర్వాత చెన్నైని వీడి వేలానికి రావాలని అనుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ సీజన్ లో సీఎస్కే దారుణ పరాజయంతో  అతడు మనసు మార్చుకున్నాడు. లోపాలను తెలుసుకుని ఈ సీజన్ లో జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చడమే గాకుండా.. రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్ వంటి మెరికలను చెన్నైకి అందించాడు. 

మిస్టర్ కూల్ కు ఫ్రాంఛైజీ తరఫున ఏటా రూ. 15 కోట్ల వరకు అందుతున్నాయని ఒక అంచనా. అయితే ధోని.. ఇప్పటికిప్పుడు చెన్నై నుంచి బయటకొచ్చినా అతడిని దక్కించుకోవడానికి  ప్రస్తుతమున్న ఏడు టీమ్ లు సిద్ధంగానే ఉన్నాయి. ధోని ఆడకున్నా సరే.. మా జట్టుతో ఉంటే చాలు అనుకునే ఓనర్లు కూడా ఉన్నారు. 

కానీ ఈ అవకాశం మేం ఎవ్వరికీ ఇవ్వమంటోంది చెన్నై యాజమాన్యం. వచ్చే ధోనిని తామే తిరిగి తీసుకుంటామని అందులో సందేహమే అక్కర్లేదని తేల్చి చెప్పింది. ధోని వీడ్కోలు మ్యాచ్ చెన్నైలోనే అని సంకేతాలివ్వడంతో పాటు.. ‘వచ్చే ఏడాది కాదు అవసరమైతే మరికొన్నాళ్లు  ధోని మాతో పాటే కొనసాగుతాడు’ అని సీఎస్కే ప్రతినిధి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తర్వాత సీజన్ లో ధోని ఆడినా ఆడకున్నా సీఎస్కేకు మెంటార్ గా వ్యవహరించడం ఖాయమని సదరు ప్రతినిధి చెప్పకనే చెప్పాడు.  ప్రస్తుతానికి ధోని టీమ్ లో 10+1 గా కొనసాగుతున్నాడని ఇప్పటికే చాలా మంది సీనియర్ క్రికెటర్లు కూడా విశ్లేషించారు. అతడిలో మునపటి ఫామ్ లేదని.. కానీ కెప్టెన్సీ విషయంలో ధోని అద్భుతంగా రాణిస్తున్నాడని కితాబిచ్చారు. 

ఇప్పటికే భారత టీ20 ప్రపంచకప్ కోసం ధోని.. ఇండియాకు మెంటార్ గా నియమితుడైన విషయం తెలిసిందే. అదే స్ట్రాటజీని చెన్నై కూడా పాటిస్తున్నది. ధోని ఆడినా ఆడకున్నా ఈ నయా క్రికెట్ చాణక్యుడిని ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత కూడా వాడుకోవాలని భావిస్తున్నది. 

click me!